Advertisement


Home > Movies - Movie News
బాధ, ఆనందం.. సాహోరే రాజమౌళి.!

సినిమా అంటే, అప్పటికప్పుడు పుట్టుకొచ్చేసేది కాదు. ఐదారు నెలలు షూటింగ్‌తో అయిపోయేది కాదు. అంతకు మించిన కష్టం సినిమాలో వుంటుంది. ఆ కష్టమేంటో, తెరవెనుక పనిచేసేవారికే బాగా తెలుస్తుందంటారు. దర్శకుడు రాజమౌళి, 'బాహుబలి'ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు. ఆ మాటకొస్తే, తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా, ప్రతి సినిమానీ ఆయన ఓ యజ్ఞంలానే భావించాడు. సినిమా సినిమాకీ పడాల్సిన కష్టం పెంచుకుంటూనే పోతున్నాడు. అతని కష్టంలానే, అతని స్థాయి కూడా సినిమా సినిమాకీ పెరుగుతూ వస్తోంది. 

ఎట్టకేలకు 'బాహుబలి' పూర్తయ్యింది. ఈ సినిమాకి సంబంధించినంతవరకు చివరి పనిదినాన్ని కూడా రాజమౌళి పూర్తి చేసేశాడు. ఇక, సినిమాని ప్రేక్షకుల ముందకు తీసుకురావడమే తరువాయి. డేట్‌ ఫిక్సయ్యింది. ఏ ప్రిల్‌ 28న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. 'బాహుబలి ది బిగినింగ్‌', 'బాహుబలి ది కంక్లూజన్‌' కలిస్తేనే 'బాహుబలి'. మొదటి పార్ట్‌, దేశం దృష్టిని ఆకర్షించింది.. ప్రపంచ స్థాయి సినిమా అనే ఖ్యాతి పొందింది. ఇప్పుడీ 'బాహుబలి ది కంక్లూజన్‌', ఇంకా పెద్ద ఘనతను సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

ఐదేళ్ళు కష్టపడ్డాడు.. అంతకు ముందు కొన్నేళ్ళ నుంచీ, ఈ సినిమాపై 'కష్టపడుతూనే వున్నాడు' రాజమౌళి. అందుకే, సినిమా పూర్తయిపోయింది, మొత్తంగా పని పూర్తయిపోయింది.. అన్న మాట వినగానే, ఒకింత ఆనందం, ఇంకొంత బాధ ఆయనలో కలిగాయి. సినిమాని ప్రేమించేవాడికి మాత్రమే ఈ ప్రత్యేకమైన భావన కలుగుతుంటుంది. సినిమాని ప్రేమించడం, సినిమా కోసం యుద్ధం చేయడం.. అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. నిజమే, 'బాహుబలి' కోసం రాజమౌళి యుద్ధమే చేశాడు. అంతకు మించే ఇంకేదో చేశాడు. అదే, ఆయన్ని మిగతా దర్శకులకన్నా భిన్నం.. అనేలా చేసింది. దేశమంతా ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తేలా చేసింది. అందుకే, సాహోరే రాజమౌళి.. అనాల్సిందే.