Home > Movies - Movie News
బాహుబలి 2 భయం పట్టుకుంది

'బాహుబలి' రిలీజ్‌కి ముందు దాని తర్వాత రాబోతున్న సినిమాల నిర్మాతలు వర్రీ అయ్యేవారు. ఆ చిత్రం చూసిన ప్రేక్షకులు తదుపరి వచ్చే చిత్రాలని దాంతో కంపేర్‌ చేస్తారని కంగారు పడేవారు. మగధీర తర్వాత చాలా కాలం పాటు తెలుగు సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్టే ఫ్లాపయ్యేవి. అంతగా ప్రేక్షకుడిని ప్రభావితం చేసిన మగధీరలానే బాహుబలి కూడా లాస్టింగ్‌ ఇంపాక్ట్‌ వేస్తుందనుకునేవారు.

కానీ బాహుబలి తర్వాత అలాంటిదేం జరగలేదు. ప్రధానంగా ఆ చిత్రంలో కథ లేకపోవడం, గ్రాఫిక్స్‌ వింతలు మినహా ఎమోషనల్‌ ఇంపాక్ట్‌ లేకపోవడంతో ఆ సినిమా తాలూకు ప్రభావం జనంపై ఎక్కువ రోజుల పాటు లేదు. అది రిలీజ్‌ అయిన నాలుగు వారాలకి వచ్చిన శ్రీమంతుడు పెద్ద హిట్‌ అవడంతో మగధీర తర్వాత వేధించిన స్లంప్‌ రాలేదని ఇండస్ట్రీ ఆనందపడింది.

అయితే బాహుబలి 2 ట్రెయిలర్‌ చూస్తుంటే బాహుబలిలో ఏమేమి మిస్‌ అయ్యాయో అవన్నీ ఇందులో వున్నట్టు అనిపిస్తోంది. ట్రెయిలర్‌లోనే ఎమోషన్స్‌ ఓ స్థాయిలో పలికాయి. ఈసారి అన్నీ ఉధృతంగా వుంటాయనేది రాజమౌళి మాటల్లోనే తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో బాహుబలి 2 తర్వాత రిలీజ్‌ చేయాలని చూస్తోన్న చిత్రాల నిర్మాతలకి టెన్షన్‌ స్టార్ట్‌ అయింది. ఇలాంటి సినిమాలు ఎల్లవేళలా రావని జనం అర్థం చేసుకుంటారో, లేక అన్నీ ఇలాంటివే ఎందుకు రావని సాధారణ చిత్రాలని కొద్ది రోజులు చిన్నచూపు చూస్తారో చూడాలి.