Advertisement


Home > Movies - Movie News
బాలయ్య హీరోయిజాన్ని తగ్గించేస్తోన్నదెవరు.?

హీరోయిజం అనగలమా.? రౌడీయిజం అంటే తప్పవుతుందా.? ఇలా పలు రకాల ప్రశ్నలు బాలకృష్ణ విషయంలో చాలామందికి కలుగుతుంటాయి. అభిమానుల చెంప అంటే బాలయ్యకున్న అభిమానం నేపథ్యంలో తలెత్తే ప్రశ్నలివి. ఆ 'లవ్‌ స్టోరీ' సాధారణ ప్రజానీకానికి ఏమాత్రం అర్థం కావడంలేదాయె.! 

'నన్ను అర్థం చేసుకోరూ..' అంటూ సన్నిహితుల వద్ద బాలయ్య వాపోతున్నారట. బాలయ్యకు వత్తాసు పలుకుతూ, ఆ 'లవ్‌స్టోరీ' గురించిన 'పిచ్చి కథల్ని' ప్రచారంలోకి తెస్తున్నారు ఇంకొందరు. ఒక్కటి మాత్రం నిజం. బాలయ్య ఎమ్మెల్యే కాబట్టి, ఖచ్చితంగా హుందాతనం ప్రదర్శించాల్సిందే. సినీ నటుడిగా, ఆ మాటకొస్తే ఓ సాధారణ వ్యక్తిగా తన చేతిని తన అదుపులో వుంచుకోవడం బాలయ్యకు తప్పనిసరి. శరీరం అందరికీ వుంటుంది.. చేతులు, కాళ్ళు, కళ్లు.. ఇలా అందరికీ సమానమే.. వాటిని అదుపులో పెట్టుకోవడమే 'విజ్ఞత'.! 

ఇక, అసలు విషయానికొస్తే బాలయ్య తనను తాను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నారు. అందుకే, బాలయ్యకు సెక్యూరిటీ తప్పనిసరైంది. ఈ విషయమై బావ చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారట. ఎమ్మెల్యే కాబట్టి, ప్రభుత్వ పరంగా ఇచ్చే సెక్యూరిటీతోపాటుగా, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్రైవేటు సెక్యూరిటీ విషయంలోనూ చంద్రబాబే తగు చర్యలు తీసుకోబోతున్నారట. 

ఇదంతా ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! హీరో బాలకృష్ణ అభిమాని చెంప పగలగొడితే అది బాలయ్యకు బ్యాడ్‌ రిమార్క్‌. టీడీపీ ఎమ్మెల్యే, ఓ కార్యకర్త లేదా ఓ సాధారణ వ్యక్తి చెంప పగలగొడితే అది టీడీపీకి మాయని మచ్చ. అద్గదీ అసలు విషయం. అంటే, బాలయ్య చుట్టూ సెక్యూరిటీ పెరిగితే తద్వారా బాలయ్య హీరోయిజం కొంత మేర తగ్గిపోతుందేమో.! అయినా, బాలయ్యకి 'చెంప మీద మోజు' ఎక్కువైతే సెక్యూరిటీ సిబ్బంది అయితేనేం, వాళ్ళమీద 'లవ్‌' ప్రదర్శించడని గ్యారంటీ ఏంటట.?