Home > Movies - Movie News
బాహుబలి-2 ఎఫెక్ట్.. బాక్సాఫీస్ బోర్

ఈ శుక్రవారం దాటితే, అవతల శుక్రవారమే బాహుబలి-2 రిలీజ్. అందుకే ఈ వీకెండ్ థియేటర్లలోకి రావడానికి భయపడుతున్నాయి చాలా సినిమాలు. రిలీజ్ డేట్స్ సెట్ కాక, థియేటర్లు దొరక్క ఇన్నాళ్లూ ఇబ్బందిపడుతున్న చిన్నాచితకా సినిమాలు మాత్రం వరస కట్టుకొని వచ్చేస్తున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ డల్ గా సాగబోతోంది. పేరుకు అరడజను సినిమాలు విడుదలవుతున్నప్పటికీ.. చెప్పుకోదగ్గ మూవీ మాత్రం ఒక్కటి కూడా లేదు.

వరుసగా డబ్బింగ్ సినిమాలతో దండెత్తుతున్న మోహన్ లాల్, ఈ శుక్రవారం బ్లాక్ మనీ పేరుతో మరో డబ్బింగ్ మూవీ రెడీ చేశాడు. మలయాళం మూవీ కాబట్టి స్టోరీలైన్ బాగుంటుంది. తెలుగులో ఆడుతుందా ఆడదా అనేది మాత్రం డౌట్. ఈ సినిమాతో పాటు రాశి నటించిన లంక సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. టెలీపతీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆత్మగా కనిపించనుంది రాశి.

ఉన్నంతలో బ్లాక్ మనీ, లంక సినిమాల్ని మినహాయిస్తే మిగతా సినిమాల గురించి చెప్పుకోవడానికేం లేదు. ఈ లిస్ట్ లో పిశాచి-2, ఇద్దరి మధ్య 18, రిజర్వేషన్ లాంటి సినిమాలున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో గట్టిగా ఆడుతున్న సినిమా ఒక్కటి కూడా లేదు. రేపు రిలీజ్ అవుతున్న మూవీస్ లో దేనికైనా మంచి టాక్ వస్తే, బాహుబలి-2 వచ్చేంత వరకు కాస్త వసూళ్లు రాబట్టుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే.. ప్రపంచమంతా బాహుబలి-2 కోసం ఎదురుచూస్తున్న ఈ టైమ్ లో చిన్న సినిమాలు చూడ్డానికి ఎంతమంది థియేటర్లకు వెళ్తారనేది పెద్ద డౌట్.