Advertisement


Home > Movies - Movie News
బెదిరింపులకు బెదిరను: కమల్‌హాసన్‌

'తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదు.. బెదిరింపులు నాకు కొత్త కాదు.. ఎన్నో సినిమాలకు ఈ తరహా బెదిరింపుల్ని ఎదుర్కొన్నాను.. ఈసారి ఇంకో హీరో సినిమా కోసం నేను బెదిరింపుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది..' అంటున్నాడు సినీ నటుడు కమల్‌హాసన్‌. తమిళ హీరో విజయ్‌ నటించిన 'మెర్‌సల్‌' సినిమాపై ఇటు వైద్య రంగానికి చెందినవారు, అటు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం విదితమే. 

సినిమాలో వైద్య రంగాన్ని కించపర్చేలా డైలాగులు, సన్నివేశాలున్నాయన్నది కొందరు వైద్యుల వాదన. వైద్య రంగంలో లోపాల్ని కడిగి పారేసేలా సినిమాలో సీన్స్‌ వుండడం, ఆ సీన్లకు మంచి రెస్పాన్స్‌ వస్తుండడంతో వైద్య రంగానికి చెందిన కొందరు ఆందోళనలకు దిగుతున్నారు. 'మా ఆందోళనలతో సినిమాకి అదనపు పబ్లిసిటీ రావడం మాకిష్టంలేదు..' అంటూ ఏకంగా, సినిమా పైరసీని ప్రోత్సహిస్తున్నారు ఇంకొందరు. 

మరోపక్క, జీఎస్‌టీ సహా పలు అంశాలపై 'మెర్‌సల్‌' సినిమాలోని డైలాగులు సహజంగానే బీజేపీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. బీజేపీ నేతలు, సినిమాని ఏకంగా బ్యాన్‌ చేసెయ్యాలంటున్నారు. ఈ వ్యవహారంపై కమల్‌ స్పందించడం, 'సినిమాకి ఇంకో సెన్సార్‌ అవసరం లేదు..' అని సోషల్‌ మీడియాలో సెటైర్లు వేయడం జరిగిపోయాయి. 

దాంతో, 'కమల్‌ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.. బీజేపీతో తలపడాలనుకుంటున్నారు.. ఈ సమయంలో ఇతర సినిమాల పేరు చెప్పి పబ్లిసిటీ స్టంట్లు చేస్తారా.?' అంటూ కొందరు మండిపడ్తోంటే, మరికొందరు 'ఒకప్పుడు దేశం విడిచిపోతానంటూ నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేసిన కమల్‌, దేశంలోని చట్టాల్ని గౌరవించడం నేర్చుకోవాలనీ లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని' ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి, చంపేస్తామంటూ హెచ్చరికలకూ దిగుతున్నారు. 

ఈ మొత్తం వ్యవహారంపై కమల్‌ తాజాగా స్పందించాడు. ఎవరికీ భయపడబోననీ, ఓ సినిమాకి సినీ నటుడిగా మద్దతిస్తే అది దేశంలో నేరంగా పరిగణింపబడటం హాస్యాస్పదమని అంటున్నాడు. మొత్తమ్మీద, కమల్‌ 'మెర్‌సల్‌' సినిమాకి మద్దతు పలికి విజయ్‌ అభిమానుల నుంచి గుడ్‌ ఇంప్రెషన్‌ కొట్టేసినా, రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారాన్ని ఎదుర్కొంటున్నాడన్నమాట.