Home > Movies - Movie News
బిగ్‌బాస్‌ - ఈ ఘనత ఎవరిది.?

70 రోజులపాటు సాగిన తెలుగు 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో నిన్నటితో ముగిసింది. మామూలుగా బిగ్‌బాస్‌ రియాల్టీ షో అనగానే, ముందుగా వివాదాలు గుర్తుకొస్తాయి. తమిళానాట బిగ్‌బాస్‌ రియాల్టీ షో కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా కొనసాగిన విషయం విదితమే. అక్కడ ఏకంగా, వ్యవహారం ఆత్మహత్యలదాకా వెళ్ళింది. కుప్పలు తెప్పలుగా వివాదాలు.. బిగ్‌బాస్‌ రియాల్టీ షోని బ్యాన్‌ చేయాలనే ఆందోళనలు.. వ్యవహారం ఏ స్థాయిలో ముదిరి పాకాన పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

హిందీ 'బిగ్‌బాస్‌' సంగతి సరే సరి. అడల్ట్‌ కంటెంట్‌ తరహాలో సాగింది హిందీ రియాల్టీ షో. మరి, తెలుగులో ఈ 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో ఎలా సాగుతుంది.? ఎన్ని వివాదాలు తెరపైకొస్తాయి.? అని ఆందోళన చెందినవారికి మాత్రం సీజన్‌ ముగింపు ఫుల్‌ శాటిస్‌ఫాక్షన్‌ ఇచ్చిందనే చెప్పాలి. దీక్షా పంత్‌, ప్రిన్స్‌ మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ మినహా, పెద్దగా వివాదాల్లేవు. మసాజ్‌ సన్నివేశం చిన్నపాటి అలజడ సృష్టించింది. అంతకు మించి, బిగ్‌బాస్‌ షోలో 'ఛీ' అనేంత సీన్స్‌ ఏమీ చోటు చేసుకోకపోవడం గమనార్హం. పార్టిసిపెంట్ల మధ్య గిల్లికజ్జాలే.. తగాదాలు చోటుచేసుకోకపోవడం మరో విశేషం. 

మొట్టమొదటి సీజన్‌ కావడంతో నిర్వాహకులు పెర్‌ఫెక్ట్‌ పానింగ్‌తో బిగ్‌బాస్‌ రియాల్టీ షోని ఎగ్జిక్యూట్‌ చేశారు. మరోపక్క, హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్‌, నభూతో నభవిష్యతి అనే స్థాయిలో బుల్లితెరపై ఈ షోని నిర్వహించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్‌లో ఈ యాంగిల్‌ కూడా వుందా.? అని ఇప్పటికీ బుల్లితెర వీక్షకులే కాదు, ఆయన అభిమానులూ ఆశ్చర్యపోతున్నారంటే అది అతిశయోక్తి కాదేమో. 

'బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది..' అంటూ చివరి రోజున ఎన్టీఆర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. 'జై లవ కుశ' సినిమా కోసం మూడు పాత్రల్లో టెన్షన్‌ పడ్తున్న తనకు 'బిగ్‌బాస్‌' చాలా రిలీఫ్‌ అని చెప్పుకొచ్చాడాయన. 'ఈ హౌస్‌, హౌస్‌మేట్స్‌, ఆడియన్స్‌.. దేన్నీ మిస్‌ అవ్వాలనుకోవడంలేదు.. కానీ తప్పదు..' అంటున్నప్పుడు ఎన్టీఆర్‌ కళ్ళు చెమర్చాయి. 

'ఎమోషన్స్‌ అండర్‌ కంట్రోల్‌' అన్పించేలా చెయ్యాలని మేగ్జిమమ్‌ ట్రై చేశాడు ఎన్టీఆర్‌. ఎలాగైతేనేం, రియాల్టీ షో మాత్రం అదిరిపోయింది. వీకెండ్‌ టీఆర్పీలు రికార్డుల్ని సృష్టిస్తే, ఫైనలిస్ట్‌ ఎంపిక సైతం వివాదాల్లేకుండా సాగింది. 'బెస్ట్‌ పార్టిసిపెంట్‌' శివబాలాజీకే టైటిల్‌ దక్కింది. మొత్తమ్మీద, బిగ్‌బాస్‌ తెలుగులో సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. తొలి సీజన్‌ ఇలా సాగింది, సెకెండ్‌ సీజన్‌ ఎప్పుడో, అదెలా సాగుతుందో వేచి చూడాల్సిందే.