Home > Movies - Movie News
'బిగ్‌' హౌస్‌మేట్స్‌ తక్కువోళ్ళేంకాదుగానీ.!

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగు బుల్లితెరపైకి 'బిగ్‌బాస్‌' షో తీసుకొచ్చారు. దీనికోసం, భారీ రెమ్యునరేషన్‌ ఇచ్చి, ఎన్టీఆర్‌ని తీసుకోవడం ద్వారా నిర్వాహకులు ఈ షోకి గ్రాండ్‌నెస్‌ తెచ్చే ప్రయత్నం చేశారు. తొలిసారి ఎన్టీఆర్‌ ఓ బుల్లితెర షోకి 'హోస్ట్‌'గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. మరి, ఆ స్థాయిలోనే గ్రాండ్‌నెస్‌ వుంటుందని ఆయన అభిమానులు, బుల్లితెర వీక్షకులు ఆశించడంలో తప్పేముంది.? 

పలువురు బిగ్‌ సెలబ్రిటీల పేర్లు 'బిగ్‌ బాస్‌' హౌస్‌ మేట్స్‌కి సంబందించి గాసిప్స్‌ కాలమ్స్‌లోకి ఎక్కాయి. తీరా షో ప్రారంభమయ్యాక, అందరూ విస్మయానికి గురయ్యారు. 'బిగ్‌' నేమ్స్‌ పెద్దగా లేకపోవడమే అందుక్కారణం. అయితే, ఎంపికైన హౌస్‌మేట్స్‌ని అంత తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. 

'బర్నింగ్‌ స్టార్‌' సంపూర్ణేష్‌, 'కత్తి' కార్తీక, మధుప్రియ, ముమైత్‌ఖాన్‌ తదితరులు ఈ షోకి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారే అవకాశాలున్నాయి. తెలంగాణ స్లాంగ్‌లో బుల్లితెర యాంకర్‌గా కత్తి కార్తీక విపరీతమైన స్టార్‌డమ్‌ సంపాదించుకున్న విషయాన్ని ఎలా కాదనగలం.? మధుప్రియ సంగతి సరే సరి. 'ఆడపిల్లనమ్మా..' పాటతోనే కాదు, ఆమె పెళ్ళి వ్యవహారం అప్పట్లో సెన్సేషన్‌ అయ్యింది. ముమైత్‌ఖాన్‌ సంగతి సరే సరి.

ఈ మధ్యనే డ్రగ్స్‌ ఆరోపణలు ఆమె మీద వచ్చాయి. ఐటమ్‌ బాంబ్‌ మాత్రమే కాదు, ఫైర్‌ బ్రాండ్‌గా కూడా ముమైత్‌ఖాన్‌కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఇక, జ్యోతి సైతం ఆ మధ్య వివాదాస్పదంగా వార్తల్లోకెక్కిన విషయం తెల్సిందే. చెప్పుకుంటూ పోతే, హౌస్‌మేట్స్‌ ఎంపికలో చాలా జాగ్రత్తగా నిర్వాహకులు వ్యవహరించారనే అనుకోవచ్చు.

అయితే, హోస్ట్‌గా అక్కడున్నది ఎన్టీఆర్‌ కదా.. ఆ స్థాయిలోనే హౌస్‌మేట్స్‌ని ఆశించడం సహజమే. ఆ రకంగా బిగ్‌బాస్‌ ఫస్ట్‌ డే ఒకింత నిరాశపర్చిందనే చెప్పొచ్చు. కానీ, బిగ్‌బాస్‌ హౌస్‌ అంటేనే వివాదాల పుట్ట. సో, వివాదం కోసం కావాల్సినంత మెటీరియల్‌ ఆ హౌస్‌లోకి చేరిపోయింది హౌస్‌మేట్స్‌ రూపంలో. ఎవరికి వారే, ఒకర్ని తక్కువ ఒకర్ని ఎక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి.