Home > Movies - Movie News
సెన్సార్‌ 'పీడ' వదిలిందట.!

సెన్సార్‌ బోర్డ్‌కి వెళ్ళాల్సి వస్తే చాలు, బాలీవుడ్‌లో ఏ నిర్మాత అయినా సరే, గుండె దిటవు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే, అక్కడ సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ పహ్లాజ్‌ నిహ్లానీ వున్నాడు మరి.! రెండేళ్ళ కాలంలో పహ్లాజ్‌ నిహ్లానీ కారణంగా తలెత్తిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. నచ్చిన సినిమాలకు నచ్చిన విధంగా 'సర్టిఫికెట్‌' మంజూరు చేయడం పహ్లాజ్‌ నిహ్లానీకే చెల్లింది. సెన్సార్‌ బోర్డ్‌ హిస్టరీలోనే పహ్లాజ్‌ నిహ్లానీ తరహాలో వివాదాలు ఎదుర్కొన్న 'చీఫ్‌' ఇంకొకరు లేరనడం అతిశయోక్తి కాదేమో.! 

ఎలాగైతేనేం, సెన్సార్‌ బోర్డ్‌కి పహ్లాజ్‌ నిహ్లానీ అనే పీడ విరగడయ్యిందట. ఇది బాలీవుడ్‌ సినీ జనం చెబుతున్నమాట. సినీ జనాన్ని పట్టి పీడించడంలో అదోరకమైన 'శాడిజం' ప్రదర్శించాడని పహ్లాజ్‌ నిహ్లానీపై దాదాపు బాలీవుడ్‌ సినీ జనం అంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. వాడుక భాషలోని పదాల్ని సైతం సెన్సార్‌ చేసేసిన ఘనుడు పహ్లాజ్‌ నిహ్లానీ. 

మొత్తమ్మీద, పహ్లాజ్‌ నిహ్లానీ సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌ పదవికి గుడ్‌ బై చెప్పాల్సి వచ్చింది. ఆయన స్థానంలో ప్రసూన్‌ జోషిని నియమించారు. పలు కమర్షియల్‌ యాడ్స్‌ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రసూన్‌ జోషి, గీత రచయితగానూ చాలా సినిమాలకు పనిచేశారు. 'ఉడ్తా పంజాబ్‌' సినిమా పహ్లాజ్‌ నిహ్లానీ దెబ్బకు విడుదలకు ముందే లీక్‌ అయిన విషయం విదితమే. లేటెస్ట్‌ వివాదం విషయానికొస్తే, 'బాబూమొషాయ్‌ బందూక్‌రాజ్‌' సినిమాకి ఏకంగా 48 'కట్స్‌' ఇచ్చేశాడు పహ్లాజ్‌ నిహ్లానీ. 

మామూలుగా అయితే సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు సినీ పరిశ్రమకు అత్యంత సన్నిహితంగా వుంటారు. కానీ, పహ్లాజ్‌ నిహ్లానీ వేరు.. ఆయన ఇండియన్‌ సినిమాకి వ్యతిరేకిగా ముద్రపడిపోయారు సెన్సార్‌ బోర్డ్‌ చీఫ్‌గా చూపిన 'అతి' కారణంగా.