Home > Movies - Movie News
చంద్రబాబు రాముడైతే, ఆమె 'ఉడత'

'ఉడతా భక్తి' అని చాలా సందర్భాల్లో అంటుంటాం. రామాయణంలో 'ఉడత' సాయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మాటని ఉపయోగించడం సర్వసాధారణమే. ఈనాటి రాజకీయానికొస్తే, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాముడట. మరి, ఉడత ఎవరు.? ఇంకెవరు, సినీ నటి వాణి విశ్వనాథ్‌. 

'నారా చంద్రబాబునాయుడు రాముడు కాబట్టే, నేను ఉడతని. ఈ మాట ఇంకెక్కడా చెల్లదు. ఆయన గొప్ప లీడర్‌. అందుకే ఉడతా భక్తిగా నేనూ తెలుగుదేశం పార్టీకి సేవ చేయడానికొస్తున్నాను..' అని వాణి విశ్వనాథ్‌ సెలవిచ్చింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా పొలిటికల్‌ 'గ్లామర్‌'కి ధీటుగా, తెలుగుదేశం పార్టీ వాణి విశ్వనాథ్‌ని రంగంలోకి దించుతోన్న విషయం విదితమే. చెన్నయ్‌లో స్థిరపడ్డ మలయాళీ కుటుంబం వాణి విశ్వనాథ్‌ నేపథ్యం. రోజా అలా కాదు, ఆమె పదహారణాల తెలుగమ్మాయి. 

వాగ్ధాటి విషయం చూసుకున్నా రోజాకి, వాణి విశ్వనాథ్‌కీ పోలికే లేదు. సినీ స్టార్‌డమ్‌ని లెక్కల్లోకి తీసుకున్నా వాణి విశ్వనాథ్‌ కంటే రోజాదే పై చేయి. రాజకీయాల్లో గ్లామరొక్కటే సరిపోదు, మంచి వాగ్ధాటి కూడా వుండాలి. ఎలా చూసుకున్నా, రోజాకి - వాణి విశ్వనాథ్‌ పోటీ అయితే కాదు.

కానీ, వాణి విశ్వనాథ్‌ మాత్రం, నగిరి నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. దానికి కారణం తమిళనాడుకీ - ఆంధ్రప్రదేశ్‌కి నగిరి బోర్డర్‌ కావడమేనట. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా, నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయమే. 

నిజానికి సినీ గ్లామర్‌ పరంగా తెలుగుదేశం పార్టీ రెండాకులు ఎక్కువే చదివేసింది. సినీ నటి జయప్రద రాజకీయాల్లోకి వచ్చిందే తెలుగుదేశం పార్టీ నుంచి. రోజా సంగతి సరే సరి. ఏం లాభం.? రాజకీయంగా వారిని వాడుకోవడం, ఆ తర్వాత 'వెన్నుపోటు' పొడవడం చంద్రబాబుకి అలవాటే.

అటు జయప్రద అయినా, ఇటు రోజా అయినా చంద్రబాబు తమను రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన వైనాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. కొత్త కదా, చంద్రబాబు ఇప్పుడు వాణి విశ్వనాథ్‌కి రాముడిగానే కన్పిస్తారు.. కాలక్రమంలో అది తప్పని ఆమెకీ తెలిసొస్తుందనుకోండి.. అది వేరే విషయం.