Home > Movies - Movie News
సినిమా సెట్టింగ్‌.. తెరవెనుక కథ.!

'మనం' సినిమా కోసం వేసిన సెట్‌.. ఆ సినిమా పూర్తయ్యాక కూడా, ఎందుకు అలాగే కొనసాగుతోందట.? ఆ సెట్టింగ్‌ నిన్న అగ్ని ప్రమాదానికి గురయ్యాక చాలామంది మదిలో మెదిలిన ప్రశ్న ఇది. 

మామూలుగా సినిమా కోసం సెట్స్‌ వెయ్యడం, షూటింగ్‌ పూర్తయ్యాక పీకి పడెయ్యడం జరుగుతుంటుంది. కానీ, కొన్ని సెట్టింగ్స్‌ చాలా చాలా ప్రత్యేకం. 'చూడాలని వుంది' సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సినిమా సెట్టింగ్‌ అప్పట్లో ట్రెండ్‌ సెట్‌ చేసింది. కోల్‌కతా నేపథ్యంలో సినిమా సాగుతుంది గనుక, ఓ భారీ అపార్ట్‌మెంట్‌ని సెట్టింగ్‌ రూపంలో వేసేశారు అన్నపూర్ణా స్టూడియోలో. ఆ సెట్టింగ్‌ గురించి ఓ రేంజ్‌లో చెప్పుకున్నారు. ఆ సెట్టింగ్‌ చూడ్డానికే, తమకు తెలిసిన సినీ ప్రముఖుల్ని వెంటేసుకుని, అన్నపూర్ణా స్టూడియోకి వెళ్ళేవారు చాలామంది. 

ఇక, 'ఒక్కడు' సినిమా కోసం వేసిన చార్మినార్‌ సెట్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గుణశేఖర్‌ దర్శకత్వం అనగానే, ముందుగా భారీ సెట్టింగ్స్‌ గుర్తుకొస్తాయి. 'అర్జున్‌' సినిమా సెట్టింగ్‌ అయితే ఇంకా ప్రత్యేకం. అర్జున్‌ సినిమా గురించి కన్నా, ఆ సినిమా కోసం వేసిన మధుర మీనాక్షి టెంపుల్‌ సెట్టింగ్‌ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు అప్పట్లో. ఇది అతిశయోక్తి కాదు. 

'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి వేయించిన సెట్టింగ్‌, ఇప్పుడు కూడా కాసుల పంట పండిస్తోంది. రామోజీ ఫిలిం సిటీకి ఇప్పుడు అదొక బ్రహ్మాండమైన టూరిజం ఎట్రాక్షన్‌గా మారింది. చాలా సినిమాల కోసం చాలా చాలా సెట్టింగ్స్‌ వేస్తుంటారు. కానీ, కొన్ని మాత్రం అలా అలా చరిత్రలో మిగిలిపోతాయి. అదే వాటి ప్రత్యేకత. అంత ప్రత్యేకత వాటికి రావడం వెనుక, చాలా కష్టం దాగి వుంటుంది. తీసేసే సెట్టే అయినా, అది పాడైపోకుండా ఎక్కువ కాలం అలాగే వుంచేందుకు కొందరు మాత్రమే ప్రయత్నిస్తుంటారు. 

లక్షలు కాదు, కోట్లు వెచ్చించి వేసే కొన్ని సెట్టింగ్స్‌.. ఆ తర్వాత కూల్చేయాలంటే మనసు ఒక్కింత చివుక్కుమంటుంది. ఆ మమకారంతోనే కొన్ని సెట్టింగ్స్‌ని అవసరం లేకపోయినా, ఎక్కువకాలం అలాగే వుంచేసి, వాటి నిర్వహణా బాధ్యతల్ని కూడా జాగ్రత్తగా చూస్తుంటారు. 'మనం' సెట్టింగ్‌ కూడా దాదాపు అలాంటిదే. అందుకే ఇన్నాళ్ళపాటు ఆ సెట్టింగ్‌ని ఇంకా అలాగే వుంచారు. ఇప్పుడది అగ్నికి ఆహుతైపోయింది. అంత మమకారంతో ఆ సెట్‌ని అలా జాగ్రత్తగా చూసుకోబట్టే, నాగార్జున కంటతడి పెట్టాల్సి వచ్చింది. పైగా, అది అక్కినేని నాగేశ్వరరావు చివరిసారిగా నటించిన 'మనం' సినిమా కోసం వేసిన సెట్టింగ్‌.