Advertisement


Home > Movies - Movie News
సినిమాటిక్‌ లిబర్టీ: ఒప్పేసుకున్న అనిల్‌

హీరో అంధుడు.. అయినా, బీభత్సంగా ఫైటింగులు చేసేస్తాడు. ఏమన్నా అంటే, 'అయామ్‌ బ్లైండ్‌.. బట్‌ ట్రైన్డ్‌..' అనేస్తాడు. అంతే, ఆ ఒక్క మాటా చాలు, హీరో ఏమైనా చేసెయ్యడానికి. ఎంత సినిమా అయితే మాత్రం, హీరో బీభత్సమైన ఫైటింగులు చేసేస్తోంటే, చూడ్డానికి జనానికి 'కళ్ళు' పనిచేయొద్దూ.! 

'రాజా ది గ్రేట్‌' సినిమా విషయంలో ఇదే జరిగింది. 'ఓవర్‌ ది బోర్డ్‌' అన్పించిన సన్నివేశాల విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సింది పోయి, దర్శకుడు అనిల్‌ రావిపూడి - హైపర్‌ ఎనర్జీకి మారు పేరైన మాస్‌ మహరాజ్‌ రవితేజని దృష్టిలో పెట్టుకుని హద్దులు దాటేశాడు. దాంతో, సినిమా విడుదలయ్యాక చాలామంది కాన్సెప్ట్‌ బాగానే వున్నా, మరీ 'అతి చేశారు' అన్న విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ఈ వ్యవహారంపై తాజాగా స్పందించాడు అనిల్‌ రావిపూడి. హీరో ట్రైన్డ్‌ అని ముందే హింట్‌ ఇచ్చామనీ, దానికి తగ్గట్టుగానే ట్రైన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరించామనీ, అయితే 'సినిమాటిక్‌ లిబర్టీ' తీసుకుని కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి వచ్చిందనీ ఆ విషయంలో చాలామంది తనను అర్థం చేసుకున్నారనీ, కొందరు మాత్రం ఆ విషయాల్ని ఎత్తి చూపారనీ, వారి అభిప్రాయాన్నీ గౌరవిస్తున్నాననీ చెప్పుకొచ్చాడు. సినిమా విషయం పక్కన పెడితే, సినిమాటిక్‌ లిబర్టీపై 'వాస్తవం' ఒప్పుకున్నందుకు అనిల్‌ రావిపూడిని అభినందించాల్సిందేనేమో.!