Advertisement


Home > Movies - Movie News
సినీ విషాదం: యువ నటుడి ఆత్మహత్య

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు విజయ్‌ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. 'అమ్మాయిలు అబ్బాయిలు' సినిమాలో నటించిన విజయ్‌ సాయి వెండితెరపై 'పొట్టి ప్రసాద్‌' పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్న విషయం విదితమే. సినిమాల్లో ఎక్కువగా చిన్న చిన్న పాత్రల్లోనే కన్పించిన విజయసాయి, గత కొంతకాలంగా తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు.. వీటికితోడు వైవాహిక జీవితంలో గొడవలు వెరసి.. విజయ్‌ సాయి ఆత్మహత్యకు కారణమని సన్నిహితులు చెబుతున్నారు. తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని విజయ్‌ సాయి మృతి చెందాడు. 'కరెంట్‌', 'వరప్రసాద్‌ పొట్టి ప్రసాద్‌', 'ఒకరికి ఒకరు', 'బొమ్మరిల్లు' తదితర సినిమాల్లో విజయ్‌సాయి నటించాడు. 

సినీ పరిశ్రమలో ఈ తరహా ఘటనలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశాలుగా మారుతుంటాయి. హీరో ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య తర్వాత, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా సినీ పరిశ్రమ నుంచి 'అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాం..' అని సినీ పరిశ్రమ పెద్దలు చెప్పుకొచ్చారు. అవకాశాలు రాకపోవడమొక్కటే ఈ తరహా బలవన్మరణాలకు కారణం కాదనే వాదన కూడా తరచుగా విన్పిస్తూనే వుంటుంది. 

అయితే, రంగుల తెరపై ఓ వెలుగు వెలిగిపోదామని ఎన్నో ఆశలతో వచ్చి, ఆ రంగంపనే ఆశలు పెట్టుకుని.. ఇతరత్రా వ్యాపకాల్ని సైతం పక్కన పెట్టేవారికి, సినీ పరిశ్రమలో తగిన అవకాశాలు రాక, ఇంకో రంగంలోకి వెళ్ళలేక ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలతో కుంగిపోయి, బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఈ తరహా ఘటనలు జరిగిన ప్రతిసారీ 'సంతాపం'తోనే సరిపెట్టడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ సినీ పరిశ్రమలో మామూలే అయిపోతోంది.