Advertisement


Home > Movies - Movie News
డాన్సుల్లో బన్నీకే పోటీ ఇచ్చిందా.?

'అల్లు అర్జున్‌తో డాన్సులేయడానికి ఇంకాస్త ఎక్కువగా స్ట్రెచ్‌ అవ్వాల్సిందే..' అంటూ కొన్నాళ్ళ క్రితం ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది పూజా హెగ్దే.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'డిజె - దువ్వాడ జగన్నాథమ్‌' సినిమాలో అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే. జూన్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నిజానికి అల్లు అర్జున్‌తో పోటీ పడి డాన్సులేయడమంటే అంత వీజీ కాదు. ఆ విషయం పూజా హెగ్దేకి కూడా తెలుసు. అందుకే, బన్నీతో పోటీ పడి డాన్సులేయడానికి ఇంకాస్త ఎక్కువగా తన ఫిజిక్‌ని 'స్ట్రెచ్‌' చేసింది.

సినిమా ఒప్పుకున్నాకే డాన్సుల్లో తన ప్రావీణ్యాన్ని ఇంకా పెంచుకుంది. ఇంతకీ, బన్నీతో పోటీ పడి పూజా హెగ్దే డాన్సులు వేసినట్టేనా.? అంటే, 'వేసినట్టే వుంది..' అని అనక తప్పదు. 

'అస్మైక.. తస్మైక..' అంటూ సాగే 'ఒడిలోన..బడిలోన..మడిలోన..' పాటకి అల్లు అర్జున్‌తో సమానంగా డాన్సులేసేసింది పూజా హెగ్దే. తాజాగా, 'సీటీమారో' పాట వీడియో ప్రోమో బయటకొచ్చింది.

ఇందులోనూ పూజా హెగ్దే డాన్సులు చాలా స్పీడ్‌గానే వేసినట్లు కన్పిస్తోంది. 'ఎన్టీఆరూ ఏఎన్నారూ మెగాస్టారూ..' అంటూ సాగుతుందీ పాట. పక్కా మాస్‌ నెంబర్‌ ఇది. 

ఇప్పటిదాకా పూజా హెగ్దేకి తెలుగులో మాస్‌ డాన్స్‌లేసే ఛాన్స్‌ రాలేదు. 'ముకుంద' సినిమాలో పెద్దగా డాన్సులేసే అవకాశమే దక్కలేదామెకి. 'ఒక లైలా కోసం' సంగతి సరే సరి.

క్లాసికల్‌ డాన్స్‌తోపాటు, మోడ్రన్‌ డాన్సుల్లో తనకున్న అనుభవాన్ని రంగరించి, బన్నీతో పోటీ పడేందుకు ప్రయత్నించాననీ, అయితే బన్నీ వేగాన్ని అందుకోలేకపోయానని అంటోంది పూజా హెగ్దే.