Home > Movies - Movie News
'దంగల్‌' దూకుడు - 'బాహుబలి' బాదుడు

వసూళ్ళ రికార్డులకు మూడింది. ఓ వైపు 'బాహుబలి', ఇంకో వైపు 'దంగల్‌' రికార్డుల దుమ్ము దులిపేస్తున్నాయి. చైనాలో 500 కోట్ల రూపాయల వసూళ్ళ దిశగా 'దంగల్‌' దూసుకెళ్తోంటే, మొత్తంగా 1500 కోట్ల వసూళ్ళ టార్గెట్‌కి అతి దగ్గరలోకి వచ్చేసింది 'బాహుబలి'. ఈ రెండు చిత్రాలూ ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ళ మార్క్‌ని దాటేసిన విషయం విదితమే. 

'దంగల్‌'తో పోల్చితే లేట్‌గా విడుదలైన 'బాహుబలి ది కంక్లూజన్‌' 1000 కోట్ల వసూళ్ళను సాధించిన తొలి ఇండియన్‌ సినిమాగా రికార్డులకెక్కింది. అంతకు ముందెప్పుడో విడుదలైన 'దంగల్‌', 850 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది ఫుల్‌ రన్‌లో. అయితే, చైనాలో విడుదలయ్యాకే 'దంగల్‌' వసూళ్ళు కొత్త రికార్డులు సృష్టించడం షురూ చేసింది. చైనా వసూళ్ళతో 'దంగల్‌' వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరింది. 

ఇదిలా వుంటే, 'బాహుబలి' ది కంక్లూజన్‌ ప్రస్తుతం 1450 కోట్ల మార్క్‌కి చేరుకుంది. అతి త్వరలో.. అంటే, రెండు మూడు రోజుల్లోనే 'బాహుబలి' 1500 కోట్ల రూపాయల మార్క్‌ చేరుకునే అవకాశముందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 'బాహుబలి ది కంక్లూజన్‌' విడుదలకు ముందు 'వెయ్యి కోట్ల టార్గెట్‌' అనే మాట గురించి చర్చ జరిగిన ప్రతిసారీ, 'అంత సీనుందా.?' అన్న మాటే విన్పించింది. కానీ, 'బాహుబలి ది కంక్లూజన్‌' అందరి అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది. 

వెయ్యి కోట్లేం ఖర్మ, వెయ్యిన్నర కోట్లు కొల్లగొట్టే సత్తా 'బాహుబలి ది కంక్లూజన్‌'కి వుందని ప్రూవ్‌ అవడానికి జస్ట్‌ రెండు మూడు రోజులు వేచి చూడక తప్పదు. 'బాహుబలి ది కంక్లూజన్‌' మన సినిమా, మన తెలుగు సినిమా. మన తెలుగు సినిమా సాధించిన ఈ విజయం అపూర్వం, అసామాన్యం.