Home > Movies - Movie News
తండ్రి కోరికను తీరుస్తానంటున్న దాసరి అరుణ్ కుమార్..

తను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనేది తండ్రి దాసరి నారాయణ రావు కోరిక అని అన్నారు దాసరి అరుణ్. దాదాపు దశాబ్దంన్నర కిందటే కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన అరుణ్ సరైన హిట్ పొందలేకపోయాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

స్వయంగా దాసరి దర్శకత్వం వహించిన సినిమా కానీ, వేరే వాళ్ల దర్శకత్వంలో నటించిన సినిమాలతో కానీ అరుణ్ అంత సక్సెస్ కాలేకపోయాడు. తండ్రి ఫేమస్ దర్శకుడు అయినా.. అరుణ్ కు మాత్రం లక్ కలిసి రాలేదు.

కొంత విరామం తర్వాత ‘ఆదివిష్ణు’ అనే సినిమాను చేశాడీయన. నాటి ట్రెండ్ కు తగ్గట్టుగా రూపొందిన ఆ సినిమా ఫర్వాలేదనిపించుకుంది కానీ, హిట్ కాలేదు. దీంతో అరుణ్ కెరీర్ కు మళ్లీ విరామం వచ్చింది.

ఈ క్రమంలో దాసరి మరణించారు. ఆ సందర్భంలో అరుణ్ కుమార్ కెరీర్ ప్రస్తావన మళ్లీ వచ్చింది. దాసరి కి ఇండస్ట్రీలో శిష్య వారసులు చాలా మందే ఉన్నా, సొంత వారసులు లేకుండా పోయారని కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే యత్నం చేస్తానని ప్రకటించారు అరుణ్.

సినిమాలు చేయాలని, ఎదగాలని తన తండ్రి చెప్పే వారని..అయితే అప్పుడు దాన్నంత సీరియస్ గా తీసుకోలేదని, ఆసక్తి కూడా అంతగా ఉండేది కాదని.. కానీ తండ్రి పోయాకా మాత్రం ఆయన అభీష్టాన్ని నెరవేర్చాలనే సెంటిమెంట్ బలపడిందని అరుణ్ అన్నారు.

ఇక ఆ ప్రయత్నంలో ఉంటానని అరుణ్ చెప్పారు. అలాగని తనేదో హీరో రోల్స్ చేయాలని అనుకోవడం లేదని.. విలన్ గా అయినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా చేస్తానని.. అరుణ్ ప్రకటించారు.

డైరెక్షన్ ఆలోచనే లేదని, అది తనకు కష్టతరం అని కూడా అరుణ్ స్పష్టం చేశారు. మరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా రెడీ అంటున్న అరుణ్ ప్రస్థానం ఇకపై ఎలా ఉంటుందో చూడాలి.