Home > Movies - Movie News
దేవసేన, శివగామి.. 1500 కోట్లు.!

'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా 1500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బాలీవుడ్‌లో ధర్మ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాని విడుదల చేసిన విషయం విదితమే. రాజమౌళి తెరకెక్కించిన, ఈ వెండితెర అద్భుతం వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరడంతోనే, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పుడీ 1500 కోట్ల వసూళ్ళతో మరో రికార్డ్‌ని తన సొంతం చేసుకుంది. 

'అసలు వెయ్యి కోట్లు ఎలా సాధ్యం.?' అని చాలామందికి చాలా చాలా అనుమానాలే కలిగాయి, సినిమా విడుదలకు ముందు. అయితే, ఆ అనుమానాలెలా వున్నా పక్కా ప్లానింగ్‌తో 'బాహుబలి ది కంక్లూజన్‌'ని మార్కెటింగ్‌ చేయగలిగారు. తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలు, అదనపు ధరలతో 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం విదితమే. బాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా 'బాహుబలి ది కంక్లూజన్‌'కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేశారు. 

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ రికార్డు వసూళ్ళను సొంతం చేసుకుంది బాహుబలి. కన్నడలో అత్యధిక వసూళ్ళను సాధించిన తొలి తెలుగు చిత్రం 'బాహుబలి'. బాలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. బాలీవుడ్‌లో ఇంకా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ విడుదలయ్యిందిగానీ, కర్నాటకలో స్ట్రెయిట్‌ తెలుగు వెర్షన్‌కే రికార్డు వసూళ్ళు వచ్చాయక్కడ. కొన్ని కారణాలతో కన్నడ డబ్బింగ్‌ని విడుదల చేయలేని పరిస్థితి. ఆ లోటుని, తెలుగు వెర్షన్‌ పూడ్చేసింది. ఓవర్సీస్‌ వసూళ్ళలో సైతం, బాహుబలి సరికొత్త రికార్డుల్ని తిరగరాసింది. 

ఇప్పటిదాకా 'బాహుబలి ది కంక్లూజన్‌' రికార్డుల వివరాల్ని తెలియజేస్తూ, పోస్టర్‌లో ప్రభాస్‌ని చూపిస్తే, 1500 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్బంగా దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ పాత్రలతో పోస్టర్‌ని డిజైన్‌ చేయడం గమనార్హం. 'బాహుబలి ది కంక్లూజన్‌' విషయానికొస్తే, ఈ ఇద్దరి పాత్రలు అత్యంత కీలకం. ఆ మాటకొస్తే, ఏ పాత్ర కీలకం కాదని అనగలం.?