Advertisement


Home > Movies - Movie News
ధనుష్ గండం గట్టెక్కేసినట్టేనా.?

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, ప్రముఖ తమిళ హీరో ధనుష్‌కి న్యాయస్థానంలో పెద్ద ఊరట లభించింది. ధనుష్‌ తమ కుమారుడేనంటూ కదిరేశన్‌ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసులో మొదటి నుంచీ అన్నీ ధనుష్‌కి ఇబ్బందికర పరిణామాలే ఎదురయ్యాయి. పుట్టుమచ్చల దగ్గర్నుంచి, ఏ విషయంలోనూ ధనుష్‌, కదిరేశన్‌ దంపతుల వాదనల ముందు ఎదురు నిలబడలేకపోయాడు. 

చిత్రంగా, ఈ కేసులో ధనుష్‌ ఊరట పొందాడు. మధురై బెంచ్‌, కదిరీశన్‌ దంపతుల పిటిషన్‌ని కొట్టి పారేసింది. ధనుష్‌ తమ కుమారుడేననీ, వృద్ధాప్యంలో తమను వదిలేశాడని ఆరోపిస్తూ, అతని నుంచి జీవన భృతి కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కదిరీశన్‌ దంపతులు. అయితే, వారికిప్పుడు న్యాయస్థానం తీర్పుతో చుక్కెదురయ్యింది. కదిరీశన్‌ దంపతులు చూపించిన సాక్ష్యాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

అయితే, కదిరీశన్‌ దంపతులు న్యాయస్థానంలో దాఖలు చేసిన సర్టిఫికెట్లకు అనుగుణంగా ధనుష్‌పై పుట్టుమచ్చలు వున్నా, వాటిని ధనుష్‌ లేజర్‌ టెక్నాలజీతో తొలగించినట్లు ప్రభుత్వ వైద్యులు ధృవీకరించినప్పటికీ, న్యాయస్థానంలో కేసు వీగిపోవడం ఆశ్చర్యకరమే. మొత్తమ్మీద, ధనుష్‌కి ఊరట లభించడంతో ఆయన కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. కదిరీశన్ దంపతులు కోర్టుని ఆశ్రయించేదాకా, ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా కొడుకుగా మాత్రమే సినీ పరిశ్రమలో ధనుష్‌ అందరికీ సుపరిచితుడు. తన నటనా ప్రతిభతో స్టార్ హీరో అనిపించుకున్న ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెను పెళ్ళాడిన విషయం విదితమే.