Advertisement


Home > Movies - Movie News
పాపం.. దిల్ రాజుకు మళ్లీ దెబ్బ పడింది

మొన్నటికిమొన్న పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన దిల్ రాజు.. కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి చేతులు కాల్చుకున్నట్టు ఓపెన్ గా ఒప్పుకున్నాడు. ఇకపై పంపిణీ విషయంలో మొహమాటాలు పెట్టుకోనని కూడా చెప్పాడు. కానీ అప్పటికే ఆయన అజ్ఞాతవాసి రైట్స్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా దిల్ రాజుకు చుక్కలు చూపెడుతోంది.

అజ్ఞాతవాసి నైజాం రైట్స్ ను ఏకంగా 29కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు దిల్ రాజు. నైజాంలో భారీ స్థాయిలో విడుదల చేశాడు. కట్ చేస్తే, సినిమాకు ఇప్పుడు నెగెటివ్ టాక్ మొదలైంది. దాదాపు వందకోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఘోరంగా రివ్యూస్ వస్తున్నాయి. భారీ రేటుకు సినిమాను కొన్న దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ కు ఇది పెద్ద దెబ్బ.

మూవీకి ఫ్లాప్ టాక్ రావడంతో.. ఈ 4-5రోజుల్లో అజ్ఞాతవాసికి వచ్చే వసూళ్లే పక్కా. ఆ తర్వాత సినిమా వసూళ్లు దైవాధీనం. అందుకే ఈ సంక్రాంతి సీజన్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు దిల్ రాజు. దీనికి తోడు అర్థరాత్రి ప్రదర్శనలకు కేసీఆర్ సర్కార్ అనుమతి నిరాకరించడం కూడా దిల్ రాజుకు మరో ఎదురు దెబ్బ.

అటు జై సింహా లైన్ లో ఉండనే ఉంది. ఆ సినిమాకు కాస్తోకూస్తో పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం దిల్ రాజు కష్టాలు మరింత పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో దిల్ రాజుకు డిస్ట్రిబ్యూషన్ అస్సలు కలిసిరాలేదు. మొన్నటికి మొన్న స్పైడర్ తో భారీగా లాస్ అయ్యాడు. 22కోట్లు పెట్టి కొన్న ఆ సినిమా అస్సలు ఆడలేదు. ఇప్పుడు 29 కోట్లు పెట్టి కొన్న అజ్ఞాతవాసి కూడా దిల్ రాజుకు షాకిచ్చింది.