Advertisement


Home > Movies - Movie News
శత్రువులుగా మార్చే రాజకీయాలు నాకొద్దు

సినిమాల మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ కలిసే ఉన్నారు. మొన్నటికిమొన్న మలేషియాలో జరిగిన స్టార్స్ ఈవెంట్ లో కూడా కలిసి పాల్గొన్నారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ మధ్య స్నేహ బంధానికి కచ్చితంగా గండి పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎట్టకేలకు ఈ 'పొలిటికల్ పోటీ'పై కమల్ స్పందించారు.

"ఈ పొలిటికల్ ప్రయాణంలో మీ స్నేహితుల్ని శత్రువులుగా మార్చుకుంటారా అంటూ చాలామంది ప్రజలు నన్ను అడుగుతున్నారు. అలాంటిదేం జరగదు. నా ఫ్రెండ్స్ ను నేను శత్రువులుగా మార్చుకోను. అలా ఆడే రాజకీయ క్రీడ నాకొద్దు. అది నా దారి కాదు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు." రజనీకాంత్ ను ఉద్దేశించి పరోక్షంగా కమల్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

రాజకీయాల్లోకి వస్తున్నట్టు ముందుగా కమల్ హాసన్ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రజనీకాంత్ కూడా పార్టీ పెట్టబోతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వీళ్లిద్దరూ కలిసి పోటీచేస్తారని ఎక్కువమంది భావించారు. కానీ సైద్ధాంతికంగా తమ దారులు వేరని ఈ ఇద్దరు సీనియర్ నటులు ప్రకటించారు.

తమిళనాట ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్, రజనీకాంత్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారని.. అప్పుడు వాళ్ల మధ్య మైత్రీ బంధం చెడిపోతుందని భావించారు కొందరు. తనది ఆధ్యాత్మిక భావాలు కలిగిన పార్టీ అని, ప్రేమతో మనసుల్ని గెలుస్తామని రజనీకాంత్ ఈమధ్య ప్రకటించారు. ఇప్పుడు కమల్ కూడా శత్రువుల్ని పెంచే రాజకీయాలు చేయనని ప్రకటించాడు.