Home > Movies - Movie News
ఈవారం సినిమాలు.. వాటి ఫలితాలు

ఒకేసారి 7 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు వీటిలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. ఏ సినిమాపై అంచనాలు కూడా లేవు.

కాకపోతే చాపకింద నీరులా, చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించే అవకాశాల్ని కొట్టిపారేయలేం కాబట్టి ఇప్పటివరకు వెయిట్‌ చేశారు ఆడియన్స్‌. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరమైన ఫలితాలేమీ లేవు.

ఆది పినిశెట్టి హీరోగా నటించిన మరకతమణి సినిమాపై కొంతమంది హోప్స్‌ పెట్టుకున్నారు. సినిమాలో కొన్ని కామెడీ పంచ్‌లు ఉన్నాయి. కాకపోతే థియేటర్లలో నిలబడే మూవీ అయితే కాదు. నేటివిటీ లేకపోవడం, మెయిన్‌ స్టోరీలైన్‌ రోటీన్‌ కావడంతో ఈ సినిమాను హిట్‌ కింద చెప్పలేం.

ఇక ఈ మూవీ తర్వాత కూసింత అంచనాలతో వచ్చిన సినిమా అవంతిక. హారర్‌ సినిమాలకు పెట్టిందిపేరైన పూర్ణ ఇందులో మెయిన్‌ లీడ్‌ చేసింది. అయితే ప్రచారంలో చూపించినంత సరుకు సినిమాలో లేకపోయేసరికి ఆడియన్స్‌ నిరుత్సారపడ్డారు.

కాదలి, పెళ్లికి ముందు ప్రేమకథ అనే మరో రెండు సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో కాదలి కోసం చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. స్వయంగా రామ్‌చరణ్‌, కేటీఆర్‌ లాంటి ప్రముఖులు రంగంలోకి దిగారు.

కేటీఆర్‌ అయితే ప్రీమియర్‌కు కూడా వచ్చారు. కానీ సినిమా మాత్రం ప్రచారంతోనే సరిపెట్టేసింది. అట్టర్‌ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక పెళ్లికి ముందు ప్రేమకథ అనే సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ఈ మూవీస్‌తో పాటు రాజా మీరు కేక అనే మరో చిన్న సినిమా కూడా వచ్చింది. యాంకర్‌ లాస్య హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ అయిన ఈ సినిమా డిజాస్టర్‌ అయింది. వీటితో పాటు వచ్చిన కార్స్‌-3, డిస్పెకబుల్‌ మి-3 అనే ఇంగ్లిష్‌ యానిమేషన్‌ సినిమాలు మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌కు నచ్చాయి.