Advertisement


Home > Movies - Movie News
తెలుగుతెర మాటల మరాఠీ ఇక లేరు!

కొన్ని దశాబ్దాలుగా తెలుగు తెరపై విప్లవ చిత్రాలకు ఏకైక రచయితగా వెలుగొందిన మాటల మరాఠీ ఎంవీఎస్ హరనాథ రావు కన్నుమూశారు. ఒంగోలులో సోమవారం ఉదయం ఆయన హఠాన్మరణం తెలుగు సినీ ప్రపంచాన్ని, రచయితలను విస్మయానికి గురిచేసింది. ఎంవిఎస్ హరనాథరావుకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన తన స్వస్థలం ఒంగోలులోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన తెలుగు సినిమా రచయితల సంఘానికి కోఆర్డినేషన్ కమిటీ ఛైర్ పర్సన్ కూడా. ఆయన లోటుకు సినీ పరిశ్రమ నివాళి అర్పిస్తోంది.

ఎంవిఎస్ హరనాథరావు వామపక్ష భావజాలం నుంచి, ప్రజానాట్య మండలి నుంచి కళాకారునిగా, రచయితగా తనను తాను నిరూపించుకుని తర్వాతి కాలంలో సినీరంగంలోకి అడుగుపెట్టిన వ్యక్తి! ఆయన స్వతహాగా నాటక రచయిత, సినీ మాటల రచయిత, దర్శకుడు, నటుడు కూడా కావడం విశేషం. దాదాపు 150 చిత్రాలకు పైగా ఆయన మాటలు అందించారు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం చిత్రాలకు ఉత్తమ సంభాషణల రచయితగా ఆయన నంది అవార్డును కూడా అందుకున్నారు. 

విప్లవచిత్రాలకు తిరుగులేని ఐకాన్ గా అతి కొద్ది చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు టి.కృష్ణ తెరకు పరిచయం చేసిన రచయిత హరనాథరావు. ఒక్క చిత్రం మినహా టి.కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటికీ హరనాథరావు రచయిత కావడం విశేషం. 

వామపక్ష రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన రచయిత కావడం మూలాన ఎంవిఎస్ హరనాథరావు మాటలు చాలా పదునుగా ఉండేవి. సమకాలీన రాజకీయ అంశాలమీద ఆయన చాలా పదునైన సెటైర్ ను ఆయన తన సంభాషణల్లో చొప్పించేవారు. అలాగే.. ఆయన నటుడిగా కూడా చాలా చిత్రాల్లో చేశారు. స్వయంకృషి వంటి చిత్రాల్లో కేరక్టర్ నటుడిగా ఆయన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయేవే.

కేవలం విప్లవాన్ని, రాజకీయ చిత్రాలను మాత్రమే కాదు.. కుటుంబ కథా చిత్రాలు, హాస్య చిత్రాలకు పనిచేసినా కూడా... తాను రాసే డైలాగుల్లో పదును, లోతైన భావం ఉండేలా జాగ్రత్తలు తీసుకునే రచయిత హరనాథరావు. పత్రికలకు వ్యాసాలు, సెటైర్లు రాసినా సరే.. వాటిని కూడా సినిమా డైలాగులు రాసినంత శ్రద్ధగా ఆయన రాస్తుంటారు. దశాబ్దాల పాటు.. కొన్ని తరహా చిత్రాలకు ఎంవీఎస్ తోనే డైలాగులు రాయించుకోవాలని.. నిర్మాతలు దర్శకులు నిరీక్షించే స్థాయిని సంపాదించుకున్నారంటే హరనాథరావు గొప్పదనాన్ని అర్థంచేసుకోవచ్చు. 

సీనియర్ దిగ్గజ రచయిత ఎంవిఎస్ హరనాథరావు మృతికి గ్రేటాంధ్ర సంతాపం తెలియజేస్తోంది.