Advertisement


Home > Movies - Movie News
పైరసీ కాళ్లు పట్టుకున్న దర్శకుడు

"చాలా కష్టపడి గ్యాంగ్ సినిమా రూపొందించాం. ఇందులో మంచి సందేశం కూడా ఉంది. కచ్చితంగా ప్రేక్షకులందరికీ ఈ సినిమా చేరువకావాలి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు బాగుపడాలి. అందుకే దయచేసి మా సినిమాతో పాటు స్కెచ్, గులేబాకావలి సినిమాల్ని పైరసీ చేయకండి. సినిమాల్ని బతికించండి." గ్యాంగ్ సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్ వేడుకోలు ఇది. తమిళనాట పైరసీకి కేంద్రబిందువుగా మారిన తమిళ్ రాకర్స్ అనే సంస్థకు విఘ్నేష్ ఇలా మొరపెట్టుకున్నాడు.

అయితే ఈ సైట్ మాత్రం విఘ్నేష్ ను క్షమించలేదు. విడుదలైన ప్రతి సినిమాను పైరసీ చేసి తీరుతామని ప్రకటించిన ఈ సంస్థ.. చెప్పినట్టుగానే విడుదలైన వెంటనే గ్యాంగ్ మూవీ తమిళ వెర్షన్ ను నెట్ లో అప్ లోడ్ చేసింది. ఆ వెంటనే విక్రమ్ నటించిన స్కెచ్ సినిమాను కూడా నెట్ లో పెట్టేసింది.

గ్యాంగ్ సినిమా తమిళవెర్షన్ (తాన సెరంథ కొట్టమ్) కు మంచి పేరొచ్చింది. పొంగల్ సీజన్ లో ఈ సినిమా ఓ ఊపు ఊపుతుందని అంతా భావిస్తున్నారు. కానీ పైరసీ ప్రింట్లు రాజ్యమేలుతున్నాయి. మరోవైపు విక్రమ్ నటించిన స్కెచ్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా పైరసీకి గురవ్వడంతో కోలుకోవడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.

పైరసీపై కొన్నాళ్లుగా కోలీవుడ్ యుద్ధం ప్రకటించింది. మూవీ విడుదలైన వెంటనే పైరసీ లింక్స్ ను కనిపెట్టి, డిలీట్ చేయడం కోసం ఎవరికివాళ్లు సొంతంగా డిజిటల్ టీమ్స్ ను ఏర్పాటుచేసుకుంటున్నారు. ఈ విషయంలో విశాల్ చాలా చురుగ్గా ఉన్నాడు. తన సినిమాలతో పాటు మిగతా సినిమాలకు సాయం చేసేందుకు ఏకంగా ఓ టీమ్ ను ఏర్పాటుచేశాడు. ఇలా ఎంతమంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొత్త సినిమాల పైరసీ లింక్స్ మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి.