Advertisement


Home > Movies - Movie News
అజ్ఞాతవాసి.. కథపై మొదట ఆ దర్శకుడి కన్ను!

ఒక ఫారెన్ సినిమా హిట్టు అయ్యిందంటే.. దాన్ని భారతీయ మూవీ మేకర్లు ఎవరికి వారుగా కాపీ ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ మూలన హిట్టైన సినిమాను అయినా సరే.. భారతీయ భాషల్లో ఏ ఇండస్ట్రీ వాళ్లు అక్కడ దాన్ని కాపీ కొట్టే ప్రయత్నాల్లో ఉంటారు. అది కూడా పేరు పొందిన దర్శకులే ఇలాంటి పనుల్లో ముందుంటారు.

తెలుగునాట అలా కాపీల, ఇన్ స్పిరేషన్ల డైరెక్టర్ల జాబితాను తయారు చేస్తే అందులో త్రివిక్రమ్ ముందుంటాడు. ఈ పరంపరలో అతడి తాజా సినిమా అజ్ఞాతవాసి కూడా నిలుస్తోంది. బహుశా తను కాపీ కొట్టిన విషయాన్ని ఎవ్వరూ కనుక్కోలేరు అని త్రివిక్రమ్ అనుకున్నాడో ఏమో.. రీమేక్ రైట్స్ ప్రసక్తే లేకుండా ఫ్రెంచి సినిమాను ఎత్తుకొచ్చాడు.

అయితే అప్పటికే టీ సీరిస్ వాళ్లు ఈ సినిమా రీమేక్ రైట్స్ ను జాతిగా కొనేసుకోవడం, చివరకు అజ్ఞాతవాసి మేకర్లు వాళ్లకు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసేసుకోవడం జరిగిపోయింది. చివరికి ఎలాగో సినిమా విడుదల అయ్యింది. డిజాస్టర్ గా నిలుస్తోంది. ఇప్పుడు చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారట. ఈ సినిమాను కాపీ చేసి తీద్దామనుకున్న వాళ్లే ఇలాంటి ఫీలింగ్ తో ఉన్నారు.

హిట్టైన ఫ్రెంచి సినిమా ‘లార్గోవించ్’ను కాపీ కొట్టాలని ముందుగా స్కెచ్ వేసింది గౌతమ్ మీనన్ అని తెలుస్తోంది. యాక్షన్ సినిమాలను రూపొందించడంలో సిద్ధహస్తుడు అయిన గౌతమ్ మీనన్.. ఫ్రెంచ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను యథాతథంగా తీద్దామని అనుకున్నాడని సమాచారం. విజయ్ హీరోగా.. లార్గోవించ్ ను రీమేక్ చేయాలనేది గౌతమ్ ప్రణాళికగా తెలుస్తోంది. దాని కోసం ఫొటో షూట్ కూడా చేశాడు ఈ దర్శకుడు, స్క్రిప్ట్ పని కూడా పూర్తి చేశాడు.

దానికి ‘యోహన్ -అధ్యాయం ఒండ్రు’ అని టైటిల్ కూడా రెడీ చేసుకున్నాడు. ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇందులో హీరో పేరు యోహన్.. అధ్యాయం ఒండ్రు అంటే ఫస్ట్ పార్ట్ అని. అయితే ఏమనుకున్నారో ఏమో కానీ.. ఈ సినిమా అంతటితోనే ఆగిపోయింది. కొన్నేళ్ల కిందటే ఇదంతా జరిగింది. అలా ఆగిన కథ.. ఇప్పుడు అజ్ఞాతవాసిగా వచ్చి.. కంగాళీ క్రియేట్ చేసింది. ఒకవేళ గౌతమ్ ఈ కథను డీల్ చేసి ఉంటే.. తనదైన శైలిలో యమ సీరియస్ గా తీసేవాడేమో!