Advertisement


Home > Movies - Movie News
ఈ టైమ్ లో పవన్, పూనమ్ కలిస్తే..?

అసలే 'కత్తి' కాక మీదుంది. ఏం మాట్లాడుతున్నాడో అతడికే అర్థంకావడం లేదు. పవన్, పూనమ్ వ్యవహారంపై ఊహించని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు. పవన్ మోసం చేస్తే పూనమ్ ఆత్మహత్యకు పాల్పడిందని, గుడిలో పవన్ కల్యాణ్ గోత్రం చెప్పి.. ఇద్దరి పేరిట జాయింట్ గా పూజలు చేయించిందని, త్రివిక్రమ్ తో కలిసి పవన్ కల్యాణ్ క్షుద్ర పూజలు చేయించిన చోట పూనం కూడా ఉందని... ఇలా ఎన్నో విమర్శలు చేశాడు. సాక్ష్యాలు కూడా ఉన్నాయని అంటున్నాడు.

పూనమ్ కు ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ హోదా పవన్ వల్లనే వచ్చిందని మొన్నటివరకు ఓ పుకారు ఉండేది. ఇప్పుడు దీనికి తోడు పైన చెప్పుకున్న విమర్శలన్నీ సంధించాడు మహేష్.

ప్రస్తుతం పవన్-పూనమ్ వ్యహహారం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి టైమ్ లో పూనమ్ కౌర్, పవన్ కల్యాణ్ కలిస్తే ఎలా ఉంటుంది..? అలాంటి కలయికనే కోరుకుంది పూనమ్ కౌర్. కలిసే అవకాశం ఇవ్వాలని ఏకంగా బహిరంగంగా ట్వీట్ చేసింది.

"గౌరవనీయులైన పవన్ కల్యాణ్ గారూ.. దయచేసి ఈ విపత్కర పరిస్థితి నుంచి నన్ను బయటపడేయండి. ఎందుకంటే ఇది నా కెరీర్ కు, నా కుటుంబానికి, అంతకుమించి నా గౌరవానికి సంబంధించిన విషయం. కొంతమంది వ్యక్తుల రహస్య ఎజెండా కోసం రాజకీయంగా లక్ష్యం కావడం నాకిష్టం లేదు. దీనికి సంబంధించి నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను." పూనమ్ పెట్టిన ట్వీట్ ఇది.

ఈ వివాదానికి సంబంధించి పూనమ్ నిజంగానే పవన్ ను కలవాలనుకుంటే తప్పు లేదు. కానీ కలవాలని కోరుకుంటున్నట్టు ఇలా ట్వీట్ చేయడం మాత్రం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల "కత్తి"కి మరింత పదునిచ్చినట్టవుతుంది తప్ప ఇంకెలాంటి ప్రయోజనం ఒనగూరదు. ఈ విషయంలో ఎవరో పూనమ్ కు కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్టున్నారు. అందుకేనేమో.. అర్థరాత్రి 11గంటల సమయంలో ట్వీట్ చేసిన పూనమ్.. పెట్టిన గంటకే వాటిని తన ఎకౌంట్ నుంచి తొలిగించింది.

ఈ విషయాన్ని ఇంతకంటే పెద్దది చేయొద్దని పవన్ కోటరీ నుంచి ఆమెకు సమాచారం అందింది. అందుకే ఆఘమేఘాల మీద ఆ ట్వీట్స్ డిలీట్ అయ్యాయి. కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే ఫ్యాన్ గ్రూప్స్ మొత్తానికి సందేశాలు అందాయి. ఎవ్వరూ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని, సోషల్ మీడియాలో ఎలాంటి చర్చలు చేయొద్దని గట్టిగా ఆదేశాలు అందాయి.  

మరోవైపు ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు కూడా వెళ్లింది. సీఎం సూచనల మేరకే అంతా సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. అజ్ఞాతవాసి విడుదలైతే ఈ ఎపిసోడ్ ను అంతా మరిచిపోతారని ఇటు పవన్, అటు చంద్రబాబు భావిస్తున్నారు.