Advertisement


Home > Movies - Movie News
కమల్‌హాసన్‌ ఛాన్స్‌ తీసుకుంటున్నాడు గానీ..

తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సినీ నటుడు కమల్‌హాసన్‌ సిద్ధమయ్యాడు. త్వరలో కమల్‌ తన కొత్త రాజకీయ పార్టీ పేరుని ప్రకటించనున్నాడు. అక్టోబర్‌ 2న కమల్‌ కొత్త పార్టీ ప్రకటన వుంటుందని కమల్‌ అభిమానులు చెబుతున్నారు. మరోపక్క, కమల్‌ కోసం వివిధ రాజకీయ పార్టీలు 'గాలం' వేయడమనే ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే వుంది. 

ప్రధానంగా కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు కమల్‌ని తమవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే, వామపక్షాలతో కలిసి రాజకీయంగా ముందడుగు వేయాలన్నది కమల్‌ ఆలోచన. త్వరలో తమిళనాడులో జరగనున్న స్థానిక ఎన్నికలకు ముందే కొత్త పార్టీని ప్రకటించి, ఆ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు కమల్‌ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీకీ, అలాగే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కమల్‌ పార్టీ సిద్ధాంతాలు వుండబోతున్నాయట. అవసరమైతే డీఎంకే, కాంగ్రెస్‌లతో పొత్తుపెట్టుకోవాలన్న యోచనలోనూ కమల్‌ వున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఇంత తక్కువ టైమ్‌లో కమల్‌ రాజకీయ నిర్ణయం తీసుకోవడం, 'తొందరపాటుతనం' అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సైతం, ఈ విషయంలో కాస్తంత ఆందోళన చెందుతున్నారట. 

కమల్‌ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నమాట నిజమే అయినా, పూర్తిస్థాయిలో కమల్‌ రాజకీయ రంగ ప్రవేశంపై తమకూ సమాచారం లేదని కమల్‌ అభిమానులు అంటున్నారు. అయినాసరే కమల్‌ ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయానికి తమ నుంచి సంపూర్ణ మద్దతు ఆయనకు లభిస్తుందని అభిమాన సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. 

అంతా బాగానే వుందిగానీ, మీడియాకెక్కి వివిధ సామాజిక అంశాలపై మాట్లాడినంత సులభం కాదు రాజకీయమంటే. మరి, రాజకీయ నాయకుడిగా కమల్‌ ప్రస్తానం ఎలా మొదలవుతుంది.? ఎలా కొనసాగుతుంది.? తమిళ రాజకీయ తెరపై కమల్‌ హల్‌చల్‌ ఎంతవరకు పనిచేస్తుంది.? వేచి చూడాల్సిందే.