Home > Movies - Movie News
బాహుబలిలో ఏముంది? కమల్ రియాక్షన్ ఇంట్రస్టింగ్!

రాజు దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఉంటాడు, అవి మంచి వాళ్లకే కనిపిస్తాయనేది షరతు. అరే, నగ్నంగా ఊరేగుతున్నాడే.. అని ఎవరైనా అంటే, తాము ఎక్కడ మంచి వాళ్లం కాకుండా పోతామో.. అనేది ప్రజల భయం. చివరకో చిన్నపిల్లాడు.. దేవతా వస్త్రాలను చూసి నవ్వడంతో.. జ్నోదయం అవుతుంది. ఇది ఎప్పుడో శతాబ్దాల నాటి కథ. అయితే ఎప్పటికప్పుడు...ఏ పరిణామాల కైనా అన్వయించుకోవచ్చు. బాహుబలి సినిమా విషయంలో కూడా. ఈ సినిమా లోటు పాట్లను ఎంచితే.. తమకు ఎక్కడ టేస్ట్ లేదని చాలా మంది సినీవాలాలే భయపడిపోతున్నారు.

ఈ సినిమాలో ఏముంది గురు? అని అంటే, అది అక్కసు అని అసహనం అని ముద్రేస్తారేమో అని భయపడిపోతున్నారు. అందుకే చాలా మంది సినీ ప్రముఖులుకూడా బాహుబలిని ఒక్కసారి పొగిడేసి తమ భారాన్ని దించేసుకుంటున్నారు. అయితే తను ‘గొర్రె’ ను కాదు అని చెప్పిన కమల్ హాసన్.. ఆ సినిమా కథ, కథనాల్లో కొత్తదనం ఏముంది? అని ఒక ప్రశ్నవేశారు. బాహుబలి సినిమా ఇంతలా హిట్ కావడం ఏమిటి? అంటూ కమల్ ఊగిపోలేదు కానీ, బాహుబలిని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా స్పందించారు.

మహాభారతంలోని ఉపకథల, బోలెడన్ని జానపదాల కథే కదా... అని కమల్ తేల్చేశారు. అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ తో భారీతనం వచ్చిందని అన్నారు. మరి ‘మీరు కూడా బాహుబలి లాంటి సినిమా తీస్తారా..?’ అన్నప్రశ్నకే కమల్ ఘాటుగా స్పందించాడు. ‘నేను గొర్రెను కాదు, కనీసం గొర్రెల కాపరిని కూడా కాదు. నేను వేరే జాతి జంతువును.. అందుకే బాహుబలి హిట్టైందని అలాంటి సినిమాను చేస్తానని అనను..’ అని కమల్ అన్నారు. మరి షరతుల్లేకుండా సినిమా వాళ్లంతా బాహుబలి సినిమాను ప్రశంసించేస్తున్న వేళ కమల్ మాత్రం ఆ సినిమాను లైట్ తీసుకోవచ్చన్నట్టుగా స్పందించారు. మరి దశాబ్దాల కిందటే ఎన్నో రకాల ప్రయోగాత్మక సినిమాలను చేసిన కమల్ కు బాహుబలి తేలికగా కనిపించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. బాహుబలి భక్తులు దీన్ని ఒప్పుకోకపోవచ్చు, ఈ మాటల తర్వాత కమల్ ను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేయవచ్చు. అలాంటి వారితో వచ్చే నష్టం కూడా ఏమీ లేదు కదా!