Home > Movies - Movie News
కన్నడిగ రాజమౌళి.!

టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి, తన తాజా సినిమా 'బాహుబలి ది కంక్లూజన్‌' ప్రమోషన్‌ కోసం వివిధ భాషల్లో మాట్లాడుతున్నాడు. చెన్నయ్‌ వెళ్ళినప్పుడు తమిళంలో, ముంబై వెళ్ళినప్పుడు హిందీ, ఇంగ్లీష్‌లలో మాట్లాడుతున్న రాజమౌళి, కన్నడ సినీ అభిమానుల మనసుల్ని గెలుచుకునేందుకు 'కన్నడిగుడి'గా మారిపోయాడు. అవును, రాజమౌళి కన్నడలో మాట్లాడేశాడు.! 

విషయమేంటంటే, కన్నడిగులు 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాని అడ్డుకుంటామంటూ అల్టిమేటం జారీ చేసేశారు. ఇదంతా, తమిళ నటుడు సత్యరాజ్‌ ఒకప్పుడు కావేరీ జలాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల వచ్చిన వివాదమే. దాంతో, రాజమౌళి రంంగలోకి దిగాడు. ఆల్రెడీ ఓ సారి ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చిన రాజమౌళి, తాజాగా కన్నడలో, కన్నడిగులకు అప్పీల్‌ చేయడం గమనార్హం. 

'బాహుబలి' సినిమాలో సత్యరాజ్‌ ఓ నటుడు మాత్రమే. సినిమాని అడ్డుకోవడం సబబు కాదంటున్న రాజమౌళి, సత్యరాజ్‌ వ్యాఖ్యల్ని వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలే తప్ప, ఆ వ్యాఖ్యల పేరుతో సినిమాని అడ్డుకోవడం వల్ల నిర్మాతలకు చాలా నష్టం కలుగుతుందని అన్నాడు. ఒకవేళ సినిమాని అడ్డుకుంటే తద్వారా సత్యరాజ్‌కి వచ్చే నష్టమేమీ వుండదన్న విషయాన్ని కన్నడిగులు గుర్తించాలని కోరాడు రాజమౌళి. 'బాహుబలి ది బిగినింగ్‌' సినిమాని కన్నడ ప్రేక్షకులు ఆదరించారనీ, అందులోనూ సత్యరాజ్‌ నటించాడనీ, ఆ సినిమా లాగానే 'బాహుబలి ది కంక్లూజన్‌' అనే గొప్ప సినిమాని కన్నడిగులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు రాజమౌళి. 

ఏదిఏమైనా, 'బాహుబలి' విషయంలో రాజమౌళి తీసుకుంటున్న శ్రద్ధని ప్రత్యేకంగా అభినందించి తీరాలి. రాజమౌళి కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఈ సినిమాకి ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌. అందుకే, సినిమాకి సంబంధించిన పూర్తి బాధ్యతలు ఆయన తన భుజాన వేసుకుంటున్నాడు.