Home > Movies - Movie News
'కాటమరాయుడు' బిస్కెట్లోయ్‌ బిస్కెట్లు.!

'కాటమరాయుడు' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌కళ్యాణ్‌ ఎడా పెడా బిస్కెట్లు వేసేశారు. అన్నయ్య చిరంజీవికి వేసిన బిస్కెట్ వెరీ వెరీ స్పెషల్. మెగా కాంపౌండ్‌ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ వేడుకకి హాజరు కాకపోవడం గమనార్హం. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌కళ్యాణ్‌ హాజరు కాకపోవడంతో మెగా కాంపౌండ్‌, పవన్‌కళ్యాణ్‌ ఫంక్షన్‌ని బాయ్‌కాట్‌ చేసిందనుకోవాలా.? ఏమో మరి.! 

అన్నట్టు, పవన్‌కళ్యాణ్‌ వేసిన బిస్కెట్ల విషయానికొస్తే, ముందుగా ఆయన బిస్కెట్‌ వేసింది అన్నయ్య చిరంజీవికే. 'అన్నయ్యే నా హీరో.. ఆయనే రియల్‌ హీరో.. నేను హీరోని కాదు..' అంటూ స్పీచ్‌లో అన్నయ్య చిరంజీవిని తలచుకున్నారు పవన్‌కళ్యాణ్‌. తలచుకోవడం కాదు, ఇదొక పెద్ద బిస్కెట్. అంతేనా, నా అభిమానులంతా చిరంజీవిగారి అభిమానులేనని సెలవిచ్చారాయన. 

ఇక, అభిమానులకి పవన్‌ వేసిన బిస్కెట్లు చాలా చాలా స్పెషల్‌. 'మీరు నా ప్రాణం..' అన్న ఒక్క మాట సరిపోదా, అభిమానులు ఫిదా అయిపోవడానికి. తమ అభిమాన హీరో, తమని ఉద్దేశించి 'నా ప్రాణం' అనేయడంతో, ఒక్కసారిగా ఆడిటోరియం మార్మోగిపోయింది. 'ఈ ఆడిటోరియంలో ఎక్కువమంది పట్టరు.. ఎక్కువమందిని రప్పించడానికి చాలా పెద్ద ఈవెంట్‌ చేసెయ్యొచ్చు.. కానీ భద్రతా కారణాల రీత్యా ఆ ఆలోచన చేయలేదు.. మీ క్షేమం నాకు ముఖ్యం..' అంటూ పవన్‌, తన అభిమానుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంతకన్నా పెద్ద బిస్కెట్ ఇంకేముంటుంది.?

తన తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి, 'గబ్బర్‌సింగ్‌' వరకూ ఏ సినిమాని ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఆయా సినిమాల్లోంచి తాను ఏం నేర్చుకున్నారో చెబుతూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్ని కట్టిపడేశాయంతే. షరా మామూలుగానే పవన్‌కళ్యాణ్‌ భక్తుడైన బండ్ల గణేష్‌ తనదైన స్టయిల్లో, భక్తిని పవన్‌కళ్యాణ్‌ మీద కురిపించేయడం మరో విశేషం.