Home > Movies - Movie News
'కాటమరాయుడు'కి ముందస్తు ప్రిపరేషన్‌.?

రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో ఎప్పుడూ ఏదో ఒక పోస్టింగ్‌ పెడుతుంటాడు.. వివాదాల్లోకెక్కుతుంటాడు. అది ఆయనకో సరదా. ఆ 'సరదా'లో భాగంగా వర్మ, పవన్‌కళ్యాణ్‌ని దేవుడ్ని చేసేశాడు. బాలాజీ (తిరుపతి వెంకన్న), యాదగిరిగుట్ట నరసింహస్వామి, భద్రాచలం (రాములోరు).. ఇలా ఈ దేవుళ్ళని పవన్‌కళ్యాణ్‌తో రీప్లేస్‌ చేసెయ్యాలట. అదీ పవన్‌కళ్యాణ్‌ భక్తుడు రామ్‌గోపాల్‌ వర్మ ఉవాచ. 

ఏంటీ, నిజంగానే వర్మ - పవన్‌కళ్యాణ్‌ భక్తుడైపోయాడా.? అని ఆశ్చర్యపోకండి. వర్మ సెటైర్‌ వేశాడంతే. పవన్‌కళ్యాణ్‌, తనకి మొక్కల మీదున్న ప్రేమని ఓ సందర్భంలో చెబితే, దాన్ని ప్రస్తావిస్తూ.. ఇదిగో ఇలా సెటైర్లు వేసేశాడన్నమాట. 'అబ్బే, అది సెటైర్‌ కాదు, పవన్‌కళ్యాణ్‌ మీద అభిమానం మాత్రమే..' అని ఎవరన్నా నమ్ముతారా.? ఛాన్సే లేదు. 

మొన్నీమధ్యనే 'బాహుబలి' పేరు చెప్పి 'పవర్‌ఫుల్‌ స్టార్లు' అంటూ వర్మ ఓ రేంజ్‌లో సెటైర్లు దంచేసిన విషయం విదితమే. పవర్‌, మెగా కలిపేసి 'బాహుబలి' మోజులో వర్మ ట్వీటు బాంబులు పేల్చేసి, ఇప్పుడు పవన్‌ని దేవుడంటున్నాడంటే.. ఎక్కడో తేడా కొట్టేస్తోంది. ఇదంతా, వర్మ 'కాటమరాయుడు'పై ముందు ముందు వేయబోయే సెటైర్లకి ప్రిపరేషనేమో అన్పిస్తోంది కదూ.!