Home > Movies - Movie News
కోపం కాదది ఆవేదన: విద్యాబాలన్‌

మామూలుగా అయితే విద్యాబాలన్‌ చాలా కూల్‌గా కనిపిస్తుంటుంది. తెరపై ఎంత హాట్‌గా గ్లామర్‌ ఒలకబోసినా, రియల్‌ లైఫ్‌లో చాలా కూల్‌గా, చాలా ఫ్రెండ్లీగా వుంటుందామె. మీడియాతో ఆమెకి వివాదాలు చాలా తక్కువ. అయితే, ఈ మధ్య ఎందుకో విద్యాబాలన్‌ ఒకింత అసహనానికి గురవుతోంది. చిన్న విషయానికే మీడియాపై గుస్సా అవుతోంది. ఈ విషయాన్ని ఆమె కూడా అంగీకరిస్తుండడం గమనార్హం. 

'డర్టీపిక్చర్‌' సినిమాకి ముందు, ఆ సినిమాకి తర్వాత.. అని చెప్పుకోవాలి విద్యాబాలన్‌ కెరీర్‌ గురించి మాట్లాడుకోవాలంటే. ఆ సినిమా ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ టర్నింగ్‌ పాయింట్‌. ఆ సినిమాలో ఆమె ఎక్స్‌పోజింగ్‌తోనే కాదు, నటనతోనూ ఆకట్టుకుంది. విమర్శకుల మనసుల్ని గెలుచుకుంది. అయినా, ఆ సినిమా విషయంలో వచ్చిన విమర్శల్ని కూల్‌గానే డీల్‌ చేసింది. 

అయితే, ఈ మధ్య విద్యాబాలన్‌ ప్రెగ్నెన్సీ గురించి మీడియాలో గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. ఒకటికి పదిసార్లు ఈ గాసిప్స్‌ని ఆమె లైట్‌ తీసుకున్నా, కొన్ని సందర్భాల్లో ఆ గాసిప్స్‌పైగా ఘాటుగానే స్పందిస్తోంది. తాజాగా, మీడియాపై 'ఇర్రెస్పాన్సిబుల్‌..' అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసే సరికి అంతా షాక్‌కి గురయ్యారు. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించింది విద్యాబాలన్‌. 

'సెలబ్రిటీలకీ పర్సనల్‌ లైఫ్‌ వుంటుంది.. ఈ విషయం చాలా సార్లు చెప్పాను.. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను..' అంటూ, తన ఆవేదనను మీడియా అర్థం చేసుకోవాలనీ, వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం చేయొద్దనీ మీడియాకి విద్యాబాలన్‌ విజ్ఞప్తి చేసింది. ఎవరైనా నా వ్యాఖ్యలతో నొచ్చుకుంటే, తనను మన్నించాలనీ.. సినిమా తప్ప, వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ఊహాగానాలకూ తావివ్వొద్దని మీడియాకి విజ్ఞప్తి చేసిందామె. అయితే, గాసిప్స్‌ని తమ పబ్లిసిటీ కోసం పెంచి పోషించే సెలబ్రిటీలు, ఇప్పుడిలా మీడియాపై గుస్సా అవుతుండడమేంటన్న వాదనా విన్పిస్తోందనుకోండి.. అది వేరే విషయం. 

ఇదిలా వుంటే, విద్యాబాలన్ నటించిన 'బేగమ్‌ జాన్‌' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'డర్టీపిక్చర్‌' తర్వాత ఆ స్థాయిలో తన మనసుకు నచ్చిన సినిమాగా ఈ సినిమా గురించి చెబుతోంది విద్యాబాలన్‌. వేశ్యావాటిక నిర్వాహకురాలిగా నటిస్తున్న తాను, చాలా పవర్‌ఫుల్‌గా ఆ సినిమాలో కన్పించబోతున్నాననీ, ఇలాంటి సినిమా ఇంకోటి భవిష్యత్తులో వస్తుందని కూడా తాను అనుకోవడంలేదనీ విద్యాబాలన్‌ చెప్పుకొచ్చింది.