Advertisement


Home > Movies - Movie News
బాలయ్య '​చెంపదెబ్బ​'​కు రవికుమార్ రియాక్షన్

పరిశ్రమలో బాలయ్య చెంపదెబ్బలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. అభిమానులకు ఆయన చెంపదెబ్బలు కామన్ అయిపోయాయి. ఆయన చేయిచేసుకుంటే అదో తుత్తిగా ఫీలవుతారు ఫ్యాన్స్. ఈ చెంపదెబ్బల భయం దర్శకుడు కేఎస్ రవికుమార్ కు కూడా ఉంది. ఆ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు ఈ దర్శకుడు. జై సింహా ప్రీ-రిలీజ్ వేడుకలో బాలయ్యపై తనకున్న అభిమానాన్ని చెబుతూనే.. షూటింగ్ మొదటిరోజు జరిగిన "చెంప దెబ్బ" అనుభవాన్ని పరోక్షంగా గుర్తుచేసుకున్నాడు. 

"బాలయ్యకు కోపం ఎక్కువ. ఆయనతో సినిమా చేయొద్దన్నారు చాలామంది. కానీ అది అబద్ధం. స్టోరీ డిస్కషన్, షూటింగ్ లో నాకు ఎక్కడా బాలయ్యలో కోపం కనిపించలేదు. ఆయనకు కోపం వస్తుంది. కాకపోతే అది యూనిట్ తో కాదు, ఆయన అసిస్టెంట్స్ తో వస్తుంది. బాలయ్యను వాళ్లు ఇరిటేట్ చేస్తుంటారు." అని అంటున్నాడు కేఎస్ రవికుమార్.

జై సింహా ముహూర్తం షాట్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ ఒకేసారి మొదలైంది. రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలయ్య తన పవర్ చూపించాడు. అసిస్టెంట్ పై చేయిచేసుకున్నాడు. మీడియా ముందే ఫట్ మంటూ ఓ చెంప దెబ్బ పడిపోయింది. దీంతో పక్కనే ఉన్న కేఎస్ రవికుమార్ బిత్తరపోయాడు. అలా షూటింగ్ మొదటిరోజే బాలయ్య తనను భయపెట్టాడని, కానీ తర్వాత అంతా సాఫీగా జరిగిపోయిందని చెబుతున్నాడు.

షూటింగ్ టైమ్ లో కేఎస్ రవికుమార్ ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదట బాలయ్య. కెరీర్ లో ఇప్పటివరకు అలా తనను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా సహకరించిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరట. వాళ్లలో ఒకరు అజిత్ అయితే, మరొకరు బాలయ్య అట.