Home > Movies - Movie News
ఖుషీలో పోయింది.. గబ్బర్ సింగ్ తో వచ్చింది

పవన్ కల్యాణ్ కెరీర్ లో ఖుషి, గబ్బర్ సింగ్ సినిమాల్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఖుషీతో స్టార్ డమ్ అందుకున్నాడు పవన్. గబ్బర్ సింగ్ సినిమాతో కోల్పోయిన క్రేజ్ ను మళ్లీ తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు పవన్ కి. ఈ రెండు సినిమాల మధ్య జరిగిన మానసిన సంఘర్షణను, విధిని తనదైన శైలిలో వివరించాడు పవన్.

కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఖుషీ, గబ్బర్ సింగ్ సినిమాల మధ్య తేడాని వివరించాడు పవన్. ఖుషి సినిమా చూస్తున్న టైమ్ లో తన మనసు కీడు శంకించిందని.. రాబోయే రోజులు గడ్డుకాలంగా ఉంటాయని, కెరీర్ పరంగా చాలా ఆటుపోట్లు చూస్తానని తనకు అప్పుడే అనిపించిందని పవన్ చెప్పాడు. 

తనకు అనిపించినట్టుగానే ఖుషీ తర్వాత తనలోని శక్తిని ఎవరో లాగేసినట్టు అనిపించిందని వివరించాడు. అలా కోల్పోయిన శక్తిని పుంజుకోవడానికి గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చిందన్నాడు పవన్. గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు మళ్లీ తనకు కోల్పోయిన శక్తి వచ్చిన ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. అలా తన కెరీర్ లో కీలకమైన 2 సినిమాల మధ్య మానసిక ప్రయాణాన్ని పవన్ అభిమానులతో పంచుకున్నాడు.