Home > Movies - Movie News
'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' - వర్మ కళ్ళతోనే చూడాలేమో.!

'రక్తచరిత్ర' సినిమాని రెండు పార్టులుగా వర్మ తెరకెక్కించాడు. రాయలసీమలో పరిటాల రవి - మద్దెలచెరువు సూరి మధ్య ఫ్యాక్షన్‌ గొడవల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అది. 'వాస్తవం' సంగతి పక్కన పెడితే, వర్మ ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు ఆ సినిమాతో. అది చాలామందికి నచ్చలేదు. వర్మ రూటే సెపరేటు.. ఈ మాట ఇప్పుడు కొత్తగా చెప్పుకుంటోన్నది కాదు. 'వంగవీటి' సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆయా కథాంశాల్ని వర్మ ఎంచుకునే తీరు, ఇటీవల కొంత అనుమానాస్పదంగా కన్పిస్తోంది. సంచలనం కోసమే కథాంశాల్ని వర్మ ఎంచుకుంటున్నాడు మరి.! 

ఇక, ఇప్పుడు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా వర్మ నుంచి రాబోతోంది. ఇది స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితంలోని అత్యంత 'కీలకమైన' ఫేజ్‌ని బేస్‌ చేసుకుని తీయనున్న సినిమా. 2018 ఫిబ్రవరిలో సినిమా సెట్స్‌ మీదకు వెళుతుందట. అక్టోబర్‌లో సినిమా విడుదలవుతుందట. నటీనటుల ఎంపిక ఇంకా జరగాల్సి వుందని వర్మ ప్రకటించాడు. 

స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించాక జరిగిన పరిణామాలు, ఎన్టీఆర్‌ మరణం దాకా చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ఈ సినిమా అన్నది వర్మ వాదన. దానికి సంబంధించి తనకు తెలిసిన విషయాలు, వాటికి అదనంగా తాను సేకరించిన సమాచారం వంటివన్నీ క్రోడీకరించి సినిమా తీస్తానంటున్నాడు వర్మ. 'కొందరిని అది బాధపెట్టొచ్చేమో.. ఇంకొందరికి సంతోషాన్నివ్వవచ్చేమో.. కానీ, నేను తీస్తోన్న సినిమా ఎవర్నీ ఇబ్బందిపెట్టడానికీ, సంతోషపెట్టడానికీ కాదు..' అని వర్మ క్లారిటీ ఇవ్వడంలోనే, అందులో ఏముంటుందో అందరికీ అర్థమయిపోతోంది. 

మొత్తమ్మీద, 'రక్తచరిత్ర', 'వంగవీటి' సినిమాల్లానే, వర్మ కళ్ళతో మాత్రమే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాని చూడాల్సి వుంటుందేమో.! ఎందుకుంటే ఇది వర్మాస్‌.. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మరి.!