Home > Movies - Movie News
లక్ష్మీ పార్వతిగా రోజా?

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో? ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు కానీ, ముందు నిత్యం ఓ సంచలనం కలిగించేలా చూసుకుంటున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నిన్నటికి నిన్న ఎన్టీఆర్ గా ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి తెచ్చాడు. అట్నుంచి కన్ ఫర్మేషన్ లేదు.

అయినా అంత అనుమానం కూడా అక్కరలేదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఎక్కువగా పూరిజగన్నాధ్ క్యాంప్ మనిషి. అందువల్ల గురువు వర్మ కోసం పూరి ఓ మాట సాయం చేసినా చేస్తాడు. ఇదిలా వుంటే లక్ష్మీ పార్వతిగా రోజా చేసే అవకాశం లేకపోలేదని వర్మ ఈ రోజు మరో బాబు పేల్చాడు. 

లక్ష్మీ పార్వతీస్ చిత్ర నిర్మాత పలమనేరు వాసి కావడంతో అక్కడి వెళ్లిన వర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, లక్ష్మీ పార్వతిగా రోజా నటించే అవకాశం లేకపోలేదని అన్నాడు. లక్ష్మీ పార్వతిగా నటించడానికి రోజా అన్ని విధాలా సరిపోతుంది. అందులో సందేహం లేదు.

కానీ దీని వల్ల సినిమాకు కీడే కానీ, మంచి జరగడం కష్టం అన్నది మాత్రం వాస్తవం. ఎప్పుడైతే వైకాపా నాయకుడు నిర్మాత అన్నపుడు, రోజా కూడా కీలక పాత్ర పోషిస్తే, ఇక జనాల దృష్టిలో ఇది వైకాపా సినిమాగా ముద్ర పడిపోతుంది. పైగా తెలుగుదేశం పార్టీ ఆ సినిమాను తిప్పి కోట్టడానికి దీన్నే ప్రచారాస్త్రంగా చేసుకుంటుంది. 

నిజానికి కొత్త వాళ్లతో పక్కగా తీస్తేనే, ఇలాంటి ప్రచారాలకు సినిమా అతీతం అవుతుంది. అలా కాకుండా వైకాపా జనాలే నిర్మాతలు, నటులు అయితే సినిమా ప్రభావం తగ్గిపోయే అవకాశం వుంది.