Advertisement


Home > Movies - Movie News
'మగధీర' కాంబో: దర్శకధీరుడేమంటాడో.!

'బాహుబలి' తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏంటి.? ఈ ప్రశ్నకైతే ఇంకా సమాధానం దొరకలేదు. ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సి వుందని మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రకటించిన విషయం విదితమే. అదే సమయంలో, చాన్నాళ్ళ క్రితమే మహేష్‌తో ఓ సినిమా చేస్తానని మహేష్‌ అభిమానులకి మాటిచ్చేశాడు. 'డార్లింగ్‌ నాతో మళ్ళీ ఓ సినిమా చేయాలి.. అదీ వీలైనంత త్వరగా..' అంటూ ప్రభాస్‌, 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి మాట తీసేసుకున్నాడనుకోండి.. అది వేరే విషయం. 

ఇలా చెప్పుకుంటూ పోతే, రాజమౌళికి ఆబ్లిగేషన్స్‌ చాలానే వున్నాయి. కొందరు నిర్మాతలు రాజమౌళి నుంచి 'హామీ' పొంది వున్నారు కూడా. తాజాగా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో 'మగధీర' కాంబో రిపీట్‌ కాబోతోందన్న కొత్త గాసిప్‌ పుట్టుకొచ్చింది. నిర్మాత అల్లు అరవింద్‌ తన కుమారుడు అల్లు అర్జున్‌ కోసం ఓ సినిమా చేయాల్సిందిగా రాజమౌళిపై ఒత్తిడి తెస్తున్నాడనే ప్రచారమూ జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో రాజమౌళి తదుపరి సినిమా ఏంటన్నదానిపై ఉత్కంఠకు తెరపడ్డం అంత తేలిక కాదు. అయితే చరణ్‌తో రాజమౌళి సినిమాపై క్లారిటీ వచ్చాకనే, రాజమౌళితో 'సైరా నరసింహారెడ్డి' సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయించారనే వాదన తెరపైకొచ్చింది. మరి, ఈ వాదనని రాజమౌళి సమర్థిస్తాడా.? మామూలుగా అయితే తన గురించి వచ్చే గాసిప్స్‌ విషయంలో రాజమౌళి కొంతమేర అప్రమత్తంగానే వుంటాడు. ఎప్పటికప్పుడు ఖండించడమో, అవును నిజమేనని చెప్పడమో చూస్తుంటాం. 

మరి, చరణ్‌తో రాజమైళి సినిమా.. అదీ 'మగధీర' తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంకో సినిమా ఇప్పట్లో సాధ్యమేనా.? వేచి చూడాల్సిందే.