Advertisement


Home > Movies - Movie News
మహేష్ తో పోటీకి సై

నేను లోకల్ సినిమాతో నాని రేంజ్ పెరిగింది. అతడి రెమ్యూనరేషన్ పెరగడమే కాదు, మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది. దీంతో ఈ హీరో ఏకంగా మహేష్ తో పోటీకి రెడీ అవుతున్నాడు. అవును..మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా, నాని చేస్తున్న నిన్ను కోరి సినిమాలు ఇప్పుడు ఒకే తేదీని లాక్ చేశాయి. 

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాను జూన్ 23న విడుదల చేయబోతున్నట్టు మురుగదాస్ ఇప్పటికే ప్రకటించాడు. తాజాగా నాని కూడా ఇదే డేట్ ఫిక్స్ చేశాడు. ప్రస్తుతం చేస్తున్న "నిన్ను కోరి" సినిమాను కూడా జూన్ 23న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. 

స్పైడర్ పై ప్రస్తుతం ఓ ప్రచారం సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యమౌతోందని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా లేట్ అవుతుండడంతో.. జూన్ లో రిలీజ్ చేయడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని, తన కొత్త సినిమా కోసం అదే డేట్ ను లాక్ చేయడంతో మహేష్ మూవీపై మరిన్ని అనుమానాలు పెరిగాయి. స్పైడర్ మూవీ కూడా అనుకున్న టైమ్ కు కంప్లీట్ అయితే, మహేష్-నాని మధ్య బాక్సాఫీస్ వార్ తప్పకపోవచ్చు.