Home > Movies - Movie News
మాహిష్మతి.. అమరావతి.. రాజమౌళే గతి.!

నో డౌట్‌.. రాజమౌళి దేశం మెచ్చిన దర్శకుడు. తెలుగు సినిమా మార్కెట్‌ని బాలీవుడ్‌ మార్కెట్‌ని దాటేసేలా చేసిన దర్శకుడు రాజమౌళి. 'బాహుబలి' సినిమాతో ఎవరూ ఊహించని వెయ్యి కోట్ల మార్క్‌ని భారతీయ సినిమాకి తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి కాక ఇంకెవరు.? వెయ్యికోట్లు ఏం ఖర్మ, 1500 కోట్ల వసూళ్ళను 'బాహుబలి ది కంక్లూజన్‌'తో దాటించిన ఘనత దేశంలో ఒక్క రాజమౌళికి మాత్రమే చెల్లుతుంది. 

'బాహుబలి' కోసం రాజమౌళి ఏకంగా మాహిష్మతి సామ్రాజ్యాన్నే సృష్టించేశాడు. అదెంత అద్భుతమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదంతా సినిమాటిక్‌ మ్యాజిక్‌ మాత్రమే. అయినాసరే, రాజమౌళి విజన్‌కి ఎవరైనా హ్యాట్సాఫ్‌ చెప్పితీరాలి. అలాగని, అదే రాజమౌళితో అమరావతిని నిర్మింపజేసేస్తానని ఎవరన్నా అంటే అంతకన్నా 'ఫూలిష్‌నెస్‌' ఇంకోటి వుండదు. మాహిష్మతి వేరు, అమరావతి వేరు. అది సినిమా.. ఇది వాస్తవం. 

సినిమాకీ, నిజానికీ తేడా తెలియకుండా పోతోంది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి. ఇప్పటికే అమరావతి కోసం మకీ సంస్థకి మకిలి పట్టించేసిన చంద్రబాబు, తాజాగా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థనీ గబ్బుపట్టించేశారు. ఇంకేముంది, డిజైన్లు ఫైనల్‌.. విజయదశమికే శంకుస్థాపన.. అంటూ నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ అందివ్వబోయే డిజైన్లపై హడావిడి చేసిన చంద్రబాబు సర్కార్‌, 'చావుకబురు' కాస్త చల్లగా చెప్పింది.. ఆ డిజైన్లు ఏమంత గొప్పగా లేవని. 

వెంటనే రాజమౌళితో సంప్రదించాలనీ, రాజమౌళిని లండన్‌కి తీసుకెళ్ళి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థతో కలిసి సూచనలు ఇప్పించేలా చూడాలని సీఆర్డీయేకి ఆదేశాలు జారీ చేసేశారు చంద్రబాబు. రాజమౌళికి గతంలోనే చంద్రబాబు ఈ తరహా ఆఫర్‌ ఇచ్చారు. అయితే, రాజమౌళికి తెలుసు.. మాహిష్మతి వేరని, అమరావతి వేరని. అందుకే, అప్పట్లో ఆయన ఒప్పుకోలేదు. అయినాగానీ, చంద్రబాబు పట్టు వదలని విక్రమార్కుడిలా రాజమౌళి కోసం ప్రయత్నిస్తూనే వున్నారు. 

ఇక్కడ రాజమౌళి భయంలోనూ అర్థం వుంది. మకీ సంస్థకి మకిలి పట్టించేసిన, నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థని గబ్బు పటించేస్తోన్న చంద్రబాబు, రాజమౌళి ప్రతిష్టని మాత్రం ఎందుకు దిగజార్చేయరు.? ఈ లాజిక్‌తోనే బహుశా అమరావతికి రాజమౌళి దూరంగా వుంటున్నారేమో. అయినా, దేశంలో వందలాది, వేలాది మంది ప్రముఖ ఆర్కిటెక్టులు వున్నారు.. వారందర్నీ కాదని, రాజమౌళి మోజులో చంద్రబాబు ఎందుకు పడుతున్నట్లు.? రాజమౌళి అయినా తన సినిమా సెట్టింగ్‌ కోసం ఖచ్చితంగా 'ఆర్ట్‌ డైరెక్టర్‌'ని ఆశ్రయించాల్సిందే.