Home > Movies - Movie News
మెయిన్‌ ట్రాక్‌లోకి మళ్ళీ జీవిత.?

2019 ఎన్నికల్లో నగిరి నియోజకవర్గానికిగాను తెలుగుదేశం పార్టీ సినీ నటి వాణి విశ్వనాథ్‌ని ట్రంప్‌ కార్డ్‌లా ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోన్న విషయం విదితమే. సినీ నటి, వైఎస్సార్సీపీ నేత రోజాకి పోటీగా వాణి విశ్వనాథ్‌ని ఇప్పటికే వెలుగులోకి తెచ్చింది టీడీపీ. అయితే, ఇంకా టీడీపీలో వాణి విశ్వనాథ్‌ చేరలేదు. చేరనున్నట్లు మాత్రం ఆల్రెడీ ప్రకటించేశారామె.  

‘ఒక్క రోజా కాదు, 10 మంది రోజాల్ని అయినా ఎదుర్కోగల సత్తా నాకుంది..’ అని వాణి విశ్వనాథ్‌ చెప్పడం, ‘రాజకీయాల్లోకి వాణి విశ్వనాథ్‌ వచ్చాక మాట్లాడుకుందాం.. ఆమె ఒక్క రోజాని అయినా ఎదుర్కోగలదా.? లేదా.? అన్నది అప్పుడే తేలుతుంది’ అని రోజా లైట్‌ తీసుకోవడం తెల్సిన విషయాలే.

ఇంతలోనే, తెలుగుదేశం పార్టీ రోజా విషయమై మరో ‘కీలక నిర్ణయం’ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినీ నటి, నిర్మాత, దర్శకురాలు జీవితని రంగంలోకి దించాలనుకుంటోందట టీడీపీ. అయితే, నగిరిలో పోటీ గురించి కాదు.. రాజకీయంగా రోజాని ఎదుర్కోవడంలో జీవిత సమర్థవంతంగా పనిచేయగలదన్నది టీడీపీ విశ్వాసం. అంటే, వాణి విశ్వనాథ్‌ని లైప్‌లైన్‌లోకి నెట్టి, జీవితని మెయిన్‌ ట్రాక్‌లోకి టీడీపీ తీసుకురావాలనుకుంటోందని అనుకోవచ్చేమో.! జీవిత రాజశేఖర్‌ దంపతులకి టీడీపీ కొత్త కాదు. గతంలో ఆ పార్టీ తరఫున పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చారు. మధ్యలో బీజేపీ వైపు చూశారు. చివరికి టీడీపీ వైపుగా జీవిత రాజశేఖర్‌ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీలో చేరుతున్నారా.? అని ప్రశ్నకు నంది అవార్డుల ప్రకటన కార్యక్రమంలో స్పందించిన జీవిత, ‘మీరు చేరమంటే చేరతా..’ అని చెప్పడం గమనార్హం. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. జీవిత మంచి మాటకారి. ఈ విషయంలో రోజాకి ధీటుగానే ఆమె నిలబడగలరు. అయితే రాజకీయాల్లో రోజా తానేంటో నిరూపించుకున్నారు.. కానీ, జీవిత రాజశేఖర్‌ మాత్రం.. ఇప్పటిదాకా ఆయా పార్టీల తరఫున ‘పని’చేయడానికి మాత్రమే పరిమితమయ్యారు.