Advertisement


Home > Movies - Movie News
'మనం'కి 'నంది'పై నాగ్‌ మనసులో మాట.!

'మనం' సినిమాకి 'నంది' పురస్కారం రాకపోవడం పట్ల మొత్తంగా సినీ పరిశ్రమ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రేక్షక లోకం షాక్‌కి గురయ్యింది. 'ఈ అవార్డులింతే.. మంచి సినిమాలకు రావు..' అన్న భావన అందరిలోనూ బలంగా విన్పిస్తోందంటే, దానికి కారణం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలే. ఇంతకు ముందూ 'నంది' పురస్కారాలపై విమర్శలు వచ్చినా, ఈసారి 'నంది' పురస్కారం తీసుకుంటే అది అవమానకరం.. అనే స్థాయికి 'నంది' ఇమేజ్‌ని దిగజార్చేశారన్నది నిర్వివాదాంశం. 

'కులం' కోటాలో కొన్ని, 'అయినవారి' కోటాలో ఇంకొన్ని.. ఇలా 'నంది' పంపకాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున - బాలకృష్ణ మధ్య విభేదాల కారణంగానే మంచి సినిమా 'మనం'కి నంది పురస్కారం రాలేదన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి, నాగార్జున అభిప్రాయమేంటి.? అంటే, ఆయన అవార్డుల్ని చాలా లైట్‌ తీసుకున్నారు. 'మనం' సినిమాకి లభించిన ప్రేక్షకాదరణే పెద్ద ఆస్కార్‌.. అని తేల్చేశారు నాగార్జున. 

సినీ రంగంలో సుదీర్ఘమైన కెరీర్‌ అక్కినేని నాగేశ్వరరావు సొంతం. స్వర్గీయ ఏఎన్నార్‌ వారసుడిగా, తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణమైన చిత్రాలు చేస్తూ, తనదైన స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న నాగార్జున, అవార్డుల గురించి ఆలోచిస్తాడని అనుకోలేం. కానీ, 'నంది' ఖచ్చితంగా రావాల్సిన సినిమా 'మనం'. 'తుది శ్వాస విడిచేదాకా నటిస్తూనే వుంటాను..' అన్న మాటని అక్కినేని నాగేశ్వరరావు నిలబెట్టుకుని చేసిన సినిమా 'మనం' కాబట్టే, ఆ సినిమాకి 'నంది' దక్కాల్సి వుందన్నది అందరి అభిప్రాయం. 

నిజానికి 'మనం' సినిమాకి గనుక 'నంది' వచ్చి వుంటే, 'నంది'కే గౌరవం పెరిగి వుండేది. కానీ, అలా జరగలేదు. 'నంది' దక్కలేదు కాబట్టి, నాగార్జున పెదవి విరవలేదు. అది ఆయన హుందాతనం. నాగార్జున నిర్మాతగా అఖిల్‌ నటిస్తోన్న 'హలో' సినిమా ట్రైలర్‌లో 'మనం' సినిమాకి ప్రేక్షకులే అవార్డ్‌ ఇచ్చారంటూ ప్రస్తావించడం, పరోక్షంగా 'నంది'పై స్పందించినట్లే అనుకోవాలి. 

ఏదిఏమైనా, 'నంది' తన స్థాయిని దిగజార్చేసుకుంది. కాదు కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, నంది అవార్డుల కమిటీ కలసికట్టుగా 'నంది' గౌరవాన్ని నేలపాలు చేసేసింది. అలాంటి 'నంది' వస్తే, అవమానమేనన్న భావన వచ్చాక, ఆ అవార్డుల తీసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా.?