Home > Movies - Movie News
మీడియాకి బిస్కెట్లేస్తోన్న హీరోయిన్‌

పోలీస్‌ గెటప్‌లో వున్నప్పుడు ఆ శాఖ మీద గౌరవం పెరిగిందనడం.. లాయర్‌గా నటిస్తున్నప్పుడు ఆ వృత్తి పట్ల అభిమానం పెరిగిందనడం.. ఇవన్నీ సినీ జనాలకి మామూలే. మీడియా విషయంలో అయితే సినీ సెలబ్రిటీల కామెంట్స్‌ ఇంకా ఆసక్తికరంగా వుంటుంటాయి. జర్నలిస్టుగా నటించాల్సి వస్తే, ఆ కిక్కే వేరప్పా.. అంటుంటారు నటీనటులు. 

బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా 'నూర్‌' సినిమా కోసం జర్నలిస్ట్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె, తనకు బాగా తెలిసిన జర్నలిస్టులతో, ఆ ప్రొఫెషన్‌కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందట. స్టింగ్‌ ఆపరేషన్ల గురించీ, రిపోర్టింగ్‌ గురించీ, ఇంకా మీడియా రంగంలో వున్న చాలా చాలా విషయాల గురించి 'రీసెర్చ్‌' చేసేశానంటోంది సోనాక్షి సిన్హా. ఇంతలా జర్నలిజం గురించి తెలుసుకున్నాక, ఆ రంగం మీద గౌరవం పెరగకుండా ఎలా వుంటుందని ప్రశ్నిస్తోందామె. 

అంతా బాగానే వుందిగానీ, మీడియా మీద సెలబ్రిటీలు అప్పుడప్పుడూ కస్సుబుస్సులాడుతుంటారు కదా.? అని మీడియా ప్రతినిథొకరు ఆమెను ప్రశ్నిస్తే, 'ఇంతకు ముందూ నాకు మీడియా మీద చాలా గౌరవం వుంది. నేనెప్పుడూ మీడియాపై నోరు పారేసుకోలేదు. ఇకపై మీడియా పట్ల గౌరవం ఇంకా పెరుగుతుంది. మీడియా ముందుకొస్తే, ఇంకా జాగ్రత్తగా, హుందాగా వ్యవహరిస్తా..' అని సెలవిచ్చింది సోనాక్షి సిన్హా. విధి నిర్వహణలో ఒక్కోసారి జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనీ, అలాంటి సంఘటనలు తలచుకుంటే మనసు చలించిపోతుందని సోనాక్షి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. 

గాసిప్స్‌ విషయంలో కొన్నిసార్లు బాధగా అన్పిస్తుందనీ, అయితే అన్ని రంగాల్లో వున్నట్లే చిన్న చిన్న మైనస్‌లు మీడియా రంగంలో కూడా వుంటాయనీ, గాసిప్స్‌ అనేవి అందులో భాగమేనని సోనాక్షి చెప్పుకొచ్చింది. తన 'నూర్‌' సినిమా జర్నలిజం గౌరవాన్ని పెంచేలా వుంటుందని సోనాక్షి చెబుతోంది. మొత్తమ్మీద, సోనాక్షి మీడియాకి భలేగా బిస్కెట్లేస్తోంది కదూ.!