Advertisement


Home > Movies - Movie News
ఒకటే బ్యానర్.. ఇంతలోనే ఎంత తేడా!

కొన్ని రోజుల కిందట హలో అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు నాగార్జున ఎంత హడావుడి చేశాడో అందరం చూశాం. కల్పించుకొని మరీ మీడియా ముందుకొచ్చాడు. సినిమా గురించి ఎంత చెప్పాలో అంత చెప్పాడు.

కట్ చేస్తే హలో వచ్చిన 3వారాల గ్యాప్ లో రంగులరాట్నం వస్తోంది. ఈ సినిమా కూడా నాగార్జునదే. ఇది కూడా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమానే. కానీ ప్రచారం విషయంలో హలోకు, రంగులరాట్నంకు భూమి-ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం కనిపిస్తోంది. 

సంక్రాంతి కానుకగా మరో 4రోజుల్లో విడుదలకాబోతున్న ఈ సినిమాను పూర్తిగా గాలికొదిలేశాడు నాగ్. సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రచారం చేపట్టలేదు. ప్రచారం మాట అటుంచి, కనీసం ఇప్పటివరకు ఈ సినిమాను కూడా చూడలేదంటే, రంగులరాట్నంపై నాగార్జునకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో అర్థమౌతోంది. 

రంగులరాట్నం సినిమాను నాగార్జున చూడలేదని స్వయంగా రాజ్ తరుణ్ వెల్లడించాడు. నిన్న డైరక్టర్ శ్రీరంజని కూడా అదే విషయాన్ని స్పష్టంచేసింది. ప్రస్తుతానికైతే వీళ్లిద్దరే సినిమా ప్రచారాన్ని తమ భుజాన వేసుకున్నారు. రిలీజ్ కు ఒక్క రోజు ముందు నాగార్జున మీడియా ముందుకొస్తాడేమో చూడాలి. 

రంగులరాట్నానికి నాగార్జున దూరంగా ఉండడానికి ప్రధానంగా 2కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా మందుకొస్తే హలో సినిమాపై నెగెటివ్ క్వశ్చన్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ఫెయిల్ అయిందనే విషయాన్ని ఒప్పుకోవాలి. అది నాగార్జునకు ఇష్టంలేదు.

ఇక రెండో కారణం ఏంటంటే.. ఈ సినిమాపై నాగార్జున ఎలాంటి రెవెన్యూ ఆశించడం లేదు. చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన రంగులరాట్నం సినిమాను, హలోతో లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేశాడు. ఆఖరి నిమిషంలో థియేటర్లు సర్దుబాటు చేశాడు. మరీ ముఖ్యంగా శాటిలైట్ రైట్స్ కూడా జీ తెలుగు ఛానెల్ కు అమ్మేశాడు. 

పైగా ఇది తన కొడుకు సినిమా కూడా కాదు. అందుకే రంగులరాట్నం అనాథగా మారింది. ఇప్పుడిది కేవలం రాజ్ తరుణ్ స్టార్ డమ్ మీదే ఆడాలి.