Home > Movies - Movie News
బూడిదైన 'మనం సెట్'.. నష్టం రూ.2 కోట్లు

అన్నపూర్ణ స్టుడియోస్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో "మనం సెట్" కాలి బూడిదైంది. మళ్లీ పునరుద్ధరించడానికి వీల్లేకుండా కాలిపోయింది ఈ సెట్. ఇందులోనే మనం సినిమాకు సంబంధించి అక్కినేని నాగేశ్వరరావుపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ మూవీ తర్వాత ఆ సెట్ ను అలానే ఉంచేశారు. ఓవైపు ఏఎన్నార్ జ్ఞాపకంగా కొనసాగుతూనే, మరోవైపు టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్స్ కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. అలాంటి సెట్ ఇప్పుడు కాలిపోయింది.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అన్నపూర్ణ ఫిలిం ఇనిస్టిట్యూట్ కు చెందిన కొందరు స్టూడెంట్స్ ఈ సెట్ లోనే ఓ షార్ట్ ఫిలిం తీస్తున్నారు. అదే టైమ్ లో కొన్ని కరెంట్ వైర్లు ఒకదానిపై ఒకటి పడ్డంతో ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. మంటలు వ్యాపించిన వెంటనే విద్యార్థులంతా అక్కడ్నుంచి తప్పించుకున్నారు. 

"నాన్నగారితో మేమంతా కలిసి నటించిన మనం సెట్ అది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అనుకుంటున్నా. 2కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది." అగ్నిప్రమాదంపై నాగార్జున రియాక్షన్ ఇది. ప్రమాదం జరిగిన టైమ్ లో నాగార్జున ఆఫీస్ లోనే ఉన్నాడు. వెంటనే ఫైరింజన్లను పిలిపించినప్పటికీ ఫలితం లేకపోయింది.