Home > Movies - Movie News
'నారా వారి ఎన్టీఆర్‌' - ఇదో పెద్ద కామెడీ.!

స్వర్గీయ ఎన్టీఆర్‌, అల్లుడి చేతిలో వెన్నుపోటుకు గురైన వైనానికి సంబంధించి 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏకి పారేయనున్నాడనే ప్రచారం జరుగుతున్న దరిమిలా, చంద్రబాబు పార్టీ శ్రేణుల్ని అలర్ట్‌ చేశారట. మరోపక్క, చంద్రబాబు మెప్పు కోసం రంగంలోకి దిగిన కొందరు టీడీపీ నేతలు, ఆనాటి ఆ 'అధికార మార్పిడి' అంశంపై ఓ సినిమా తీస్తే, అదీ చంద్రబాబు కోణంలో తీస్తే బావుంటుందన్న ఆలోచన చేస్తున్నారట. 

టీడీపీ నేతల్లో చాలామందికి సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలున్న విషయం విదితమే. ఆ సంగతి పక్కన పెడితే, దర్శకుడు బోయపాటి శ్రీను, టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడాయె. సో, చంద్రబాబు కోణంలో 'వెన్నుపోటు - అధికార మార్పిడి' వ్యవహారాన్ని తెరకెక్కించే బాధ్యత బోయపాటి చేతిలో పెట్టేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

అయితే, రామ్‌గోపాల్‌ వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' విషయమై పబ్లిసిటీ తప్ప, పూర్తిస్థాయిలో క్లారిటీ ఇప్పట్లో రాకపోవచ్చు. ఎందుకంటే, పైకి చెప్పేదొకటి.. చివరకి తీసేదొకటి.. ఇదీ వర్మ, బయోపిక్స్‌ విషయంలో ప్రతిసారీ నిరూపితమవుతూనే వుంది. ముందస్తుగా జాగ్రత్త పడే వర్మ, 'నాకు నచ్చిన పాయింట్‌.. నా కోణంలో..' అంటుంటాడు. ఎలాగూ సినిమా అనేది కమర్షియల్‌ ఎలిమెంట్‌ కాబట్టి,, వర్మ తనకు ఎలా అనుకూలంగా వుంటే అలా మార్చేసుకుంటాడనుకోండి.. అది వేరే విషయం. 

మొత్తమ్మీద, బాలయ్య ఎన్టీఆర్‌ మాటేమోగానీ, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'కి పోటీగా 'నారా వారి ఎన్టీఆర్‌' అయితే ఆశించొచ్చన్నమాట. అయితే అది వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని ఎలా చూపించాడన్నదానిపైనే ఆధారపడి వుండొచ్చు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఎవరికి నచ్చినట్లు వారికి కన్పించడమా.? కామెడీ అనాలా.? ఇంకేమన్నా అనాలా.?