Home > Movies - Movie News
నటుడిగానా.? ఇప్పుడా.? ఛాన్సుందా.!

దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్‌కుమార్‌ గుర్తున్నాడా.? అదేనండీ, కృష్ణవంశీ 'అంతఃపురం' సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశాడే.. ఆ కుర్రాడే.

హీరోగా ఒకటీ అరా సినిమాలు చేసినా దాసరి అరుణ్‌కుమార్‌ సక్సెస్‌ కొట్టలేకపోయాడు. దాంతో, సినిమాలకు దూరమైపోయాడు. నిజానికి, నటన మీద దాసరి అరుణ్‌కి అస్సలేమాత్రం ఇంట్రెస్ట్‌ లేదట. ఇదే విషయమై దాసరి ఆవేదన చెందుతుండేవారు కూడా. 

సినీ రంగంలో తన వారసుడిగా దాసరి, తన కుమారుడు అరుణ్‌ ఎదుగుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారుగానీ, అవన్నీ అడియాసలయ్యాయి. ఇప్పుడు, దాసరి మరణం తర్వాత అరుణ్‌, తిరిగి సినిమాల్లో నటిస్తానంటున్నాడు.

హీరోగా నటించాలనే ఆలోచన తనకి లేదని, విలన్‌గా రాణించాలనుకుంటున్నాననీ అరుణ్‌ చెప్పుకొచ్చాడు. దాసరి వున్నప్పుడే కొన్ని సినిమాలకు ప్రొడక్షన్‌ చూసుకున్నాననీ, ఇకపై ప్రొడక్షన్‌ దిశగా అడుగులే వస్తాననీ అంటున్నాడు దాసరి అరుణ్‌. 

నటన మీద అరుణ్‌ ఇన్నాళ్ళకు ఆసక్తి చూపుతున్నాడుగానీ, పరిస్థితులు ఇప్పుడంత అనుకూలంగా వున్నాయా.? నటుడిగా అసలు దాసరి అరుణ్‌కి ఛాన్స్‌ ఇచ్చేదెవరు.? ఇచ్చినా, ఒకప్పుడు ఇంట్రెస్ట్‌ లేదని వదిలేసిన నటనని దాసరి అరుణ్‌ ఇప్పుడు సీరియస్‌గా తీసుకుంటాడని ఎలా అనుకోగలం.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి. 

దాసరి నారాయణరావు యాక్టివ్‌గా వున్న సమయంలోనే, దాసరి అరుణ్‌ సినిమాల మీద శ్రద్ధ పెట్టి వుంటే, తనయుడ్ని తెరపై చూసుకుని ఆయన మరింత మురిసిపోయేవారే.. పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయేవారే.! ప్చ్‌, ఆయనకు ఆ ఛాన్స్‌ లేకుండాపోయింది.