Advertisement


Home > Movies - Movie News
ఎన్టీఆర్‌ 'టచ్‌'లోనే వున్నాడట

ఆ మధ్య ఎన్టీఆర్‌ కొత్త సినిమా ఏది విడుదలైనా సోషల్‌ మీడియాలో, 'ఎన్టీఆర్‌ మనోడు కాదు..' అంటూ నందమూరి అభిమానుల్లో ఓ వర్గం గట్టిగానే ప్రచారం చేసేది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటివాటిద్వారానే కాకుండా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఈ తరహా ప్రచారం జరిగేది. కానీ, ఈసారి పరిస్థితులు మారాయి. ప్రస్తుతం నందమూరి క్యాంప్‌లో 'యాంటీ ఎన్టీఆర్‌' మాట విన్పించడంలేదు. కారణమేంటట.? ఈ మాటకి సమాధానంగా, 'ఎన్టీఆర్‌ టీడీపీతో టచ్‌లోకి వెళ్లాడు కాబట్టి' అనే మాట విన్పిస్తోంది. 

2019 ఎన్నికల నాటికి ఎన్టీఆర్‌, టీడీపీ తరఫున ప్రచారం చేయొచ్చన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. హరికృష్ణ ద్వారా ఎన్టీఆర్‌ని చంద్రబాబు తనవైపుకు తిప్పుకున్నారన్నది ఆ గాసిప్స్‌ సారాంశం. మరోపక్క, ఎన్టీఆర్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్లోనే వున్నాడన్నది తాజా ఖబర్. అలాగైతే, బాలయ్యనో, చంద్రబాబునో ’జై లవకుశ‘ ఈవెంట్స్ కి అతిథులుగా పిలిచేవారే కదా.? అనడక్కండి.. అదంతే. పై స్థాయిలో సంగతేమోగానీ, నందమూరి అభిమానుల మధ్య కనిపిస్తున్న ఈ 'యూనిటీ' సహజంగానే, ఎన్టీఆర్‌ సొంత అభిమానులకు కొండంత బలాన్నిస్తోంది. 

నిజమే మరి, కొన్నాళ్ళ క్రితం ఎన్టీఆర్‌ నుంచి ఏ సినిమా వచ్చినా, అభిమానుల మధ్య నానా యాగీ జరిగేది. ఆ యాగీ కొంతమేర ఎన్టీఆర్‌ సినిమాల మీదా ప్రభావం చూపించిందనుకోండి.. అది వేరే విషయం. సినిమా సినిమానే.. కానీ, ఆ సినిమానీ భ్రష్టుపట్టించేయగల సత్తా రాజకీయానికి వుందని ఒప్పుకుని తీరాల్సిందే. 

ఇంతకీ, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసినట్లుగా ఎన్టీఆర్‌, 2019లోనూ టీడీపీ తరఫున ప్రచారం చేస్తాడా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.