Advertisement


Home > Movies - Movie News
'పద్మావతి' - చరిత్ర కాదు, కల్పిత కథేనా.?

14వ శతాబ్దం నాటి కథ అని కొందరు.. కాదు కాదు, అది ఓ కల్పిత కథ అని ఇంకొందరు.. 'రాణి పద్మిని' గురించి చాలా కాలంగా చాలా చాలా రచ్చ జరుగుతోంది. 'చిత్తోర్‌ఘడ్‌' సంస్థానాధీశుడు రాణా రతన్‌ సింగ్‌ భార్య రాణి పద్మిని జీవితమే 'పద్మావతి' సినిమా అన్న ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అసలు, పద్మావతి కావొచ్చు.. రాణి పద్మిని కావొచ్చు.. అలాంటి చరిత్రే లేదన్నది కొందరు చరిత్రకారుల వాదన. 

ఇప్పుడీ కొత్త కథ ఏంటంటారా.? 'పద్మావతి' వివాదంలో నిజంగానే ఇదొక పెద్ద ట్విస్ట్‌. ఆనాటి ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆందోళనబాట పట్టిన దరిమిలా, అది కల్పితం.. అనే ప్రచారం తెరపైకి తీసుకురావడం ద్వారా 'పద్మావతి' సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకోవాలన్న ఆలోచనే.. ఈ కొత్త కథలోని అసలు కోణం అనుకోవాలేమో.! 

అసలు 'పద్మావతి' సినిమాలో ఏముందో తెలియక జనం జుట్టు పీక్కునే పరిస్థితి దాపురిస్తే, కొత్తగా అది చరిత్రా.? కల్పిత కథా.? అన్న కొత్త అనుమానాలేంటట.? ఏమోగానీ, 'పద్మావతి' సినిమాకైతే 140 కోట్ల రూపాయల మేర ఇన్స్యూరెన్స్‌ వుందట. సినిమా విడుదలై దారుణంగా దెబ్బతినేసినా, నష్టమేమీ వుండదన్నది సినీ వర్గాల నుంచి వెల్లడవుతోన్న వాస్తవం. 

సినిమా ఇప్పుడు కాకపోతే ఇంకో నెల రోజుల తర్వాత.. లేదంటే మూడు నెలలు, ఆరు నెలల తర్వాతైనా విడుదలై తీరుతుంది. మరీ 'అభ్యంతరాలు' ఎక్కువైతే, వాటిని నిర్మాత పరిగణనలోకి తీసుకుంటే కొన్ని సన్నివేశాలకు 'కత్తెర' పడొచ్చు కూడా. ఎలాగోలా సినిమా విడుదలైతే నిర్మాతకు పెద్దగా నష్టం వుండకపోవచ్చన్నది 'ఇన్స్యూరెన్స్‌' ద్వారా క్లియర్‌ అవుతున్న విషయం. 

అంతా బాగానే వుందిగానీ పద్మావతి అనేది జీవిత చరిత్ర అనుకోవాలా.? కల్పిత కథ అనుకోవాలా.? మళ్ళీ ఇప్పుడు కొత్తగా చరిత్రకారుల్ని తీసుకొచ్చి, చరిత్ర తవ్వించాలేమో.!