Home > Movies - Movie News
పార్టీ సరే, టైమెక్కడుంది.?

రాజకీయ పార్టీ అంటే మాటలా.? పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చేయాలంటే.. దానికి చాలా కలిసిరావాలి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్‌కలి కలిసొచ్చినట్లుగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కి కలిసొచ్చినట్లుగా అందరికీ కలిసొచ్చెయ్యాలన్న రూల్‌ ఏమీ లేదు. అందునా, ఈ రోజుల్లో రాజకీయ పార్టీ అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. అందునా, సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడమంటే వ్యవహారం మరీ తేడా కొట్టేస్తోంది. 

తమిళనాడులో రజనీకాంత్‌, రాజకీయ పార్టీ పెట్టాలా.? వద్దా.? అన్న విషయమై ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్నదెందుకు.? తెలుగునాట పవన్‌కళ్యాణ్‌ జనసేన అనే పార్టీని స్థాపించినా, దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి మీనమేషాల్లెక్కెడుతున్నదెందుకు.? ఇవన్నీ చూశాక అయినా, కాస్తంత ఆచి తూచి వ్యవహరించి వుండాల్సింది రాజకీయాల్లోకి వచ్చే విషయమై కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర. 

కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించేసిన ఉపేంద్ర, మార్పు ప్రజలతోనే సాధ్యమనీ, తాను ప్రజల ఆకాంక్షల్ని గట్టిగా విన్పించగల నేతనవుతానని చెప్పుకొచ్చేశాడు. రాజకీయాల్లో ఎవరైనా చెప్పే మాటలు ఇవే. మాటలకీ, చేతలకీ చాలా తేడా వుంటుంది. అప్పుడే, ఉపేంద్రకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో 'వార్‌' షురూ అయిపోయింది. కాంగ్రెస్‌ పెంపుడు డాష్‌ అనీ, బీజేపీ కనుసన్నల్లో నడిచే 'డాష్‌ డాష్‌' అనీ, ఉపేంద్ర గురించి సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ షురూ అయ్యాయి. 

రాజకీయాల్లో వున్నవారికి, కొత్తగా రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్నవారికీ, సోషల్‌ మీడియాలో ఈ స్థాయిలో 'పొగడ్తలు' మామూలేననుకోండి.. అది వేరే విషయం. కానీ, రాజకీయ పార్టీ పెట్టి దాన్ని జనంలోకి తీసుకెళ్ళేంత సమయం ఉపేంద్రకి ప్రస్తుతం వుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఉపేంద్ర మాత్రం, 'జనం రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారు.. వారి ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీ సిద్ధాంతాల్ని తయారుచేసుకోగలిగితే.. రాజకీయ పార్టీగా ఎదగడానికి పెద్దగా సమయం అవసరం వుండదు..' అంటున్నాడు. నిజమేనా.? కర్నాటకలో ఉపేంద్రకి అనుకూలంగా పరిస్థితులున్నాయా.? వేచి చూడాల్సిందే.