Advertisement


Home > Movies - Movie News
పాటెందుకు పాడకూడదు.?

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం.. ఇద్దరూ ఇద్దరే. ఎవరి విభాగంలో వారు అత్యున్నత స్థాయి ప్రతిభను కలిగివున్నవారే. వారికి 'సర్టిఫికెట్‌' ఇవ్వగలిగే స్థాయి, ఆ రంగంలో ఇప్పుడున్నవారెవరికీ సాధ్యంకాదు. అంతటి ప్రతిభావంతులైన, ఆ ఇద్దరూ ఇప్పుడు 'రచ్చకెక్కారు'. 

'నేను స్వరపర్చిన పాట నా అనుమతి లేకుండా పాడటానికి వీల్లేదు..' అంటూ సంగీత దర్శకుడు ఇళయరాజా, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకి నోటీసులు పంపడంతో వివాదం మొదలైంది. 'సరే, ఇకపై నేను ఇళయరాజా స్వరపరిచిన పాటల్ని ఎక్కడా పాడను..' అనేశారు బాలు. దాంతో వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లే. కానీ, ఇదే రూట్‌లో మిగతా సంగీత దర్శకులు కూడా అడుగులేస్తే.. అసలంటూ, ఎక్కడా ఎవరూ పాట పాడే పరిస్థితి వుండదు. 

టీవీ షోలు, ఇతరత్రా ఈవెంట్స్‌లో సినిమా పాటలకి బీభత్సమైన క్రేజ్‌ వుందన్నది అందరికీ తెల్సిన విషయమే. సినిమా పాట లేకుండా, ఇప్పుడు ఏ ఈవెంట్‌ జరగడంలేదనడం అతిశయోక్తి కాదేమో. ప్రతిసారీ, సదరు సంగీత దర్శకుడికి సమాచారమిచ్చి, అనుమతి తీసుకుని పాటలు పాడాలంటే.. అది చాలా కష్టమైన వ్యవహారం. అసలు, ఏ పాట మీద అయినా హక్కులు ఎవరికి వుంటాయి.? అన్నది ఇక్కడ కీలకమైన విషయం. 

సినిమా నిర్మాతకే అన్ని రైట్స్‌ వుంటాయి. ఎందుకంటే, సినిమా కోసం మొత్తంగా ఖర్చు చేసేది ఆయనే గనుక. రచయిత, సంగీత దర్శకుడు, నేపథ్య సంగీత దర్శకుడు.. ఇలా వీళ్ళందరూ, నిర్మాత కోసం పనిచేయాల్సి వుంటుంది. కాబట్టి, 'రాయల్టీ' అన్నమాట వాడాల్సి వస్తే, అది నిర్మాతకే వర్తిస్తుందేమో.! నిర్మాత ఎటూ, ఓ ఆడియో కంపెనీకి అమ్మేస్తాడు గనుక.. రాయల్టీ అనేది మళ్ళీ అటువైపుకి వెళ్ళాపోవాలి. ఇదొక చిత్రమైన సందర్భం. 

'ఇళయరాజా పాటల మీద కొందరు వ్యాపారం చేస్తున్నారు.. అందుకే ఈ నోటీసులు..' అన్నది ఇళయరాజా సన్నిహితుల వాదన. ఈవెంట్స్‌ ఊరకనే చేయరు కదా.! అవి వ్యాపార కోణంలో జరిగేవే. వందలాది, వేలాది, లక్షలాది ఈవెంట్స్‌ జరుగుతున్నాయి ఇటీవలి కాలంలో. చిన్న చిన్న ఈవెంట్స్‌ నుంచి పెద్ద పెద్ద ఈవెంట్స్‌ దాకా వుంటాయవి. సో, రాయల్టీ.. అన్నమాట ఇలా పాటలు పాడే విషయంలో వాడేసి, వివాదం సృష్టిస్తే ఇక అంతే సంగతులు. 

సినీ నేపథ్య గాయనీ గాయకులు.. సినిమాల్లో పాటలు పాడితే వచ్చే సంపాదనకన్నా, ఇతరత్రా ఈవెంట్స్‌లో పాటలు పాడటం ద్వారానే ఇంకా ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇళయరాజా బాటలోనే సంగీత దర్శకులంతా నడిస్తే, అసలంటూ గాయనీ గాయకుల పరిస్థితి అత్యంత దుర్భరంగా తయారైపోతుందన్నది నిర్వివాదాంశం.