Advertisement


Home > Movies - Movie News
పవన్, చిరంజీవి 'మెగా' అనుబంధం

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ విడిపోయారట కదా.! అన్నదమ్ములిద్దరికీ అస్సలేమాత్రం పడటంలేదట కదా.! ఇలా కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ వస్తూనే వున్నాయి. తొమ్మిదేళ్ళ విరామం తర్వాత అన్నయ్య చిరంజీవి, సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తే, ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి హాజరు కాలేనంత బిజీగా తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ వుంటాడని ఎవరైనా అనుకోగలరా.? కానీ, జరిగిందే.! అదీ అన్నదమ్ముల మధ్య 'మెగా' అనుబంధం.! 

ఇప్పుడిదంతా ఎందుకంటే, రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారిగా పవన్‌కళ్యాణ్‌ అన్నయ్య చిరంజీవి మీద తనకున్న అమితమైన అభిమానాన్ని చాటేసుకున్నారు మరి. అలా ఇలా కాదు, రాజకీయాల్లో మార్పు కోసం అన్నయ్య చిరంజీవి ప్రయత్నించారనీ, అయితే ఆయనకు కొంతమంది ద్రోహం తలపెట్టడంతో 'మార్పు' అనే ప్రయత్నం విఫలమయ్యిందని పవన్‌కళ్యాణ్‌, విశాఖలో జనసేన కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతే కాదండోయ్‌, చిరంజీవికి ద్రోహం చేసినవారెవరో తనకింకా గుర్తున్నారనీ, అలాంటివారందరికీ గట్టి సమాధానం చెప్పి తీరతానని పవన్‌కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. రాజకీయమన్నాక 'ద్రోహం' వంటి పదాల్ని చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించాలి. 'బదులు తీర్చుకుంటా' అనే మాటని వీలైనంత తక్కువగా వాడాల్సి వుంటుంది. 

అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని దెబ్బతీసింది, కాంగ్రెస్‌ పార్టీనే. వైఎస్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి ఏ స్థాయిలో అడ్డుపుల్లేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ డైరెక్ట్‌గా కాకపోయినా, ఇన్‌డైరెక్ట్‌గా ప్రజారాజ్యం పార్టీని దెబ్బకొట్టేందుకు తనవంతుగా ప్రయత్నించింది. టీడీపీ నుంచి, కాంగ్రెస్‌ నుంచీ కోవర్టులు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి, ఆ పార్టీని 'గబ్బు పట్టించారన్నది' నిర్వివాదాంశం. కథ చాలానే వుంది. చిరంజీవికి అత్యంత సన్నిహితులనబడ్డవారు సైతం 'టిక్కెట్ల అమ్మకానికి' తెరలేపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సమయంలో అల్లు అరవింద్‌ పేరు ప్రముఖంగా విన్పించిన విషయం విదితమే. 

రాజకీయం అంటేనే అంత. రాజకీయాల్లో అన్నీ వుంటాయి. ద్రోహం, వెన్నుపోటు.. వీటన్నిటినీ తట్టుకోగలిగితేనే రాజకీయాల్లో నిలదొక్కుకున్నట్లు. అన్నయ్య మీద అభిమానం పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడిలా బాహాటంగా ఎందుకు ప్రదర్శించారోగానీ, ఇదేదో 'మెగా సెంటిమెంట్‌ కార్డ్‌' ప్రయోగం.. అనే అనుమానాలైతే కలుగుతున్నాయి. 

ప్రజారాజ్యం ఇప్పటి కథ కాదు.. దాదాపు పదేళ్ళ క్రితం నాటి వ్యవహారం. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది రాజకీయం. తనను దెబ్బకొట్టిన కాంగ్రెస్‌ పార్టీలోనే ప్రజారాజ్యం పార్టీని కలిపేశారు చిరంజీవి. కాంగ్రెస్‌ నుంచే చిరంజీవి రాజ్యసభకు వెళ్ళారు, కేంద్రమంత్రి అయ్యారు కూడా. ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్‌ నేత అన్న విషయాన్ని పవన్‌ మర్చిపోతే ఎలా.?