Advertisement


Home > Movies - Movie News
పవన్‌కళ్యాణే మొదటి 'నిందితుడు'.!

అది 2008 ఆగస్ట్‌ 26.. చిరంజీవి అభిమానులు కలలో కూడా మర్చిపోలేని రోజు అది. మర్చిపోదామని ఎంతలా తంటాలు పడ్తున్నా, మర్చిపోవడం వల్ల కావడంలేదు. ఎందుకంటే, ఆ రోజు మెగాస్టార్‌ చిరంజీవి కాస్తా, ప్రజారాజ్యం పార్టీ అధినేత అయ్యారు గనుక. తిరుపతిలో అత్యంత ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీ పేరుని చిరంజీవి ప్రకటించిన తేదీ 2008 ఆగస్ట్‌ 26. 

పార్టీ స్థాపించి, జనంలోకి తీసుకెళ్ళడానికి చిరంజీవి చాలా చాలా కష్టపడ్డారు. నిజమే మరి, అప్పటిదాకా సినిమానే ఆయన జీవితం. జనంలోకి రాజకీయ నాయకుడిగా వెళ్ళాల్సి రావడంతో, చెమటోడ్చక తప్పలేదు. ఈ క్రమంలో చిరంజీవి వెంట చాలామంది నిలిచారు. అందులో ఒకరొకరుగా ఆ తర్వాత జారిపోయారనుకోండి.. అది వేరే విషయం. చివరికి, చిరంజీవి సొంత తమ్ముడు, పవన్‌కళ్యాణ్‌ కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి జారిపోవాల్సి వచ్చింది. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, చిరంజీవికి ద్రోహం జరిగిందట ప్రజారాజ్యం పార్టీ విషయంలో. మరి, ఆ ద్రోహానికి కారకులెవరట.? పరకాల ప్రభాకర్‌, మిత్రా.. ఇలా కొందరి పేర్లు బయటకొస్తున్నాయిప్పుడు. లిస్ట్‌ తీస్తే, అందులో చాలామందే వుంటారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతల్లో చాలామంది కోవర్టులున్నారు. రాజకీయం అంటేనే అంత.! ఎవర్నీ నమ్మడానికి వీల్లేదు. నమ్మడం, చిరంజీవి చేసిన అతి పెద్ద తప్పు. 

మిగతా వాళ్ళంతా వచ్చారు, వెళ్ళారు. ఇప్పుడూ రాజకీయాల్లో జరుగుతున్నది అదే. ఈ రోజు ఓ పార్టీలో వున్న నేత, రేపు ఇంకో పార్టీలో చేరుతున్నారు. నిస్సిగ్గుగా మంత్రి పదవుల్లోనూ కూర్చుంటున్నారు కొంతమంది పార్టీ ఫిరాయించేసి. అలాంటిది, చిరంజీవిని మీద ఆశలు పెట్టుకున్నారు, కుదరదనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ఇందులో తప్పేముందట.? 

కానీ, పవన్‌కళ్యాణ్‌ ఏం చేసినట్టు.? అన్నయ్యతో కలిసి ప్రజారాజ్యం పార్టీని ఎలాగైనా నడపాల్సిందిపోయి, ఎన్నికల ఫలితాలు రాగానే, పార్టీ జెండా పక్కన పడేశాడు. సినీ రంగంలో ఈ రోజు పవన్‌కళ్యాణ్‌ ఈ స్థాయిలో వున్నారంటే, దానికి కారణం చిరంజీవి. ఆ లెక్కన, ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ని వదిలి వెళ్ళి వుండకూడదు. 'తాడో పేడో అన్నయ్యతోనే..' అనుకుని వుండాల్సింది. కానీ, పవన్‌ అలా చేయలేదు. 

సో.. మొత్తంగా చూస్తే, ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం జరిగిందన్న పవన్‌కళ్యాణ్‌ మాటలే నిజమైతే, ఆ ద్రోహానికి సంబంధించి తొలి నిందితుడు నూటికి నూరుపాళ్ళూ పవన్‌కళ్యానే అవుతాడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.